సాక్షి, హైదరాబాద్: పోలీసులను గులాబీ పార్టీకి గులాములుగా మార్చుకుని పని చేయించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని, తప్పుడు కేసులతో కాంగ్రెస్ నేతలను బెదిరించలేరని, తెలంగాణ ప్రజలు తమవైపే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలపై నమోదవుతున్న కేసులపై ఆ పార్టీ నేతలు శుక్రవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, మొన్న జగ్గారెడ్డిపై దొంగ కేసు పెట్టారని, ఆ మరుసటి రోజే మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డిపై ఆయుధ చట్టం కేసు.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంపై ఎస్సీ, ఎస్టీ కేసుతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. పోలీస్ శాఖలోని కొంత మంది కింది స్థాయి అధికారులపై తమకు అనుమానం ఉందని, డీజీపీపై పూర్తి నమ్మకం ఉందని అందుకే వినతిపత్రం సమర్పించామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల జాబితా రూపొందించామని, అధికారంలోకి రాగానే వారిపై విచారణ జరిపిస్తామన్నారు. తనపై నమోదైన కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని డీజీపీకి కూన శ్రీశైలం వివరించారు.
గులాబీ గులాములుగా చేసుకున్నారు: దాసోజు
Published Sat, Sep 15 2018 3:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment