కూచ్‌బెహర్/ఉదయ్‌పూర్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత్‌ను విడగొట్టాలనీ, దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండాలని చెప్పేవారితో మమత చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను స్పీడ్ బ్రేకర్‌లా మమతా బెనర్జీ ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనీ, అందువల్లే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ విపక్షాల వ్యవహారశైలిని తప్పుపట్టారు.
బెంగాల్ ప్రతిష్టను దిగజార్చారు..
బెంగాల్‌లోని కూచ్ బెహర్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి మంజూరు చేసినప్పటికీ మమత అడ్డుకున్నారని ఆరోపించారు. ‘శారదా, రోజ్ వ్యాలీ, నారదా చిట్‌ఫండ్ కుంభకోణాలతో దీదీ(మమత) బెంగాల్ ప్రతిష్టను దిగజార్చారు. దోపిడీ చేసిన ప్రతీ పైసాకు ఈ చౌకీదార్(కాపలాదారు) లెక్కలు అడుగుతాడు. మోదీ.. మోదీ అనే నినాదాలతో ఈ బెంగాల్ స్పీడ్ బ్రేకర్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
ఎన్నికల సంఘంపై మమత కోప్పడటం పశ్చిమబెంగాల్‌లో ఆమె రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయని చెప్పేందుకు నిదర్శనం’ అని మోదీ తెలిపారు. భారత్, కశ్మీర్‌కు వేర్వేరుగా ప్రధానులు ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇటీవల చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. దేశాన్ని ముక్కలుముక్కలు చేయాలనుకునే ఇలాంటి వ్యక్తులతో మమత చేతులు కలుపుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యల ద్వారా మమత భారత్‌లో కశ్మీర్ విలీనానికి పాటుపడ్డ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి దిగ్గజ నేతల త్యాగాలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చొరబాటుదారులకు ఆశ్రయం..
విదేశీ చొరబాటుదారులకు ఆశ్రయమివ్వడం ద్వారా మమత కేంద్రాన్ని మోసం చేశారని మండిపడ్డారు. ‘ఇలాంటి అక్రమ చొరబాటుదారుల్ని దేశం నుంచి తరిమివేయడానికి ఈ చౌకీదార్ జాతీయ పౌర, పౌరసత్వ రిజిస్టర్ బిల్లును తీసుకొచ్చాడు. కానీ మమత తన మహాకల్తీకూటమి మిత్రపక్షాలతో కలిసి కేంద్రాన్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్తా–అల్లుడి ప్రభుత్వం(మమతా బెనర్జీ–అభిషేక్ బెనర్జీ) ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని చొరబాటుదారులకు స్వర్గంగా మార్చేసింది’ అని విమర్శించారు. 7వ వేతన సంఘం సిఫార్స్‌లను బెంగాల్‌లో ఎందుకు అమలు చేయడం లేదో మమత చెప్పారా? అని ప్రజలను మోదీ ప్రశ్నించారు
ఏపీ నుంచి రాహుల్ పోటీచేయొచ్చు కదా!
కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. త్రిపురలోని ఉదయ్‌పూర్ సభలో మాట్లాడుతూ..‘25 ఏళ్ల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి త్రిపుర దేశానికి ఆదర్శంగా నిలిచింది. బీజేపీని నమ్మి గెలిపించినందుకు నేను త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నా. విపక్షాలు నన్ను అధికారం నుంచి తప్పించేందుకు ఎంతకైనా తెగిస్తాయి. అవసరమైతే పాకిస్తాన్‌కు భజన చేసేందుకు కూడా వెనుకాడవు. త్రిపురలో అధికారం కోసం పోరాడుతున్న కాంగ్రెస్, వామపక్షాలు కేంద్రంలో మాత్రం ఏకమవుతున్నారు.
వామపక్షాల సహకారం లేకుంటే రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? దక్షిణాది నుంచే పోటీచేయాలనుకుంటే పాండిచ్చేరి, కర్ణాటకలు కూడా ఉన్నాయి కదా. మరీ అంతగా కావాలనుకుంటే ఏపీకి కూడా రాహుల్ వెళ్లొచ్చు. అక్కడ కాంగ్రెస్ ఇటీవల యూటర్న్ బాబు(చంద్రబాబు)తో చేతులు కలిపింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2014 నుంచి ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగిన టీడీపీ గతేడాది మార్చిలో కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే త్రిపురలో ఏడాది కాలంలోనే బిప్లవ్ దేబ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి పనులు చేపట్టిందనీ, మౌలిక సదుపాయాలు కల్పించిందని మోదీ కితాబిచ్చారు. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11, 18 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment