పొత్తుకోసం.. కాంగ్రెస్‌-టీడీపీ తహతహ! | Congress MLA Secret Meet To CM Chandrababu Naidu In Amaravati | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లో పొత్తుకోసం.. కాంగ్రెస్‌-టీడీపీ తహతహ!

Published Sat, Jul 7 2018 1:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress MLA Secret Meet To CM Chandrababu Naidu In Amaravati - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు! ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు దృష్టి కొంతకాలంగా కాంగ్రెస్‌పై పడింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తెర వెనుక దౌత్యం నడుపుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేరుగానే ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పొత్తు కుదుర్చుకోవడానికి ముందే కాంగ్రెస్‌లో ఫలానా వారిని చేర్చడానికి వీలుగా ఓ జాబితాను రూపొందించుకున్నారు. 

దాన్ని అమలు చేసేందుకు రాహుల్‌ గాంధీతో తెరవెనుక చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం మేరకు తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇటీవల అమరావతి వెళ్లి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రెండ్రోజులపాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యే రెండుసార్లు చంద్రబాబుతో రహస్యంగా సమావేశమైనట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాహుల్‌గాంధీకి సలహాదారుగా ఉన్న ఓ మాజీ బ్యూరోక్రాట్‌కు ఈ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో చంద్రబాబు నుంచి తగిన సూచనలు, సలహాలు తీసుకుని వాటిని రాహుల్‌గాంధీకి అందజేయడమే ఈ సమావేశం ఉద్దేశమని తెలుస్తోంది. 

డ్రైవర్, గన్‌మెన్‌ లేకుండా వెళ్లిన ఎమ్మెల్యే 
పొత్తు ప్రతిపాదనపై చంద్రబాబుతో చర్చించేందుకు అధిష్టాన వర్గం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు ఒకరిని ఎంపిక చేసుకుంది. అందులో భాగంగానే రాహుల్‌ సలహాదారు సూచనల మేరకు ఏపీ సరిహద్దు జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇటీవల విజయవాడ వెళ్లారు. ఈ వార్త ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో గుప్పుమంది. గన్‌మెన్, డ్రైవర్‌ లేకుండా తానే సొంతంగా వాహనాన్ని డ్రైవ్‌ చేస్తూ వెళ్లిన సదరు ఎమ్మెల్యే విజయవాడలో రెండ్రోజులు ఉన్నారు. మొదటి రోజు చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఆయన నుంచి వచ్చిన ప్రతిపాదనలను సదరు ఎమ్మెల్యే రాహుల్‌ సలహాదారుకు చేరవేశారు. ఆ ప్రతిపాదనలపై తిరిగి రాహుల్‌గాంధీ సలహాదారు నుంచి వచ్చిన స్పందనను చంద్రబాబుకు రెండోరోజు కలిసి వివరించారు.

ఏపీకి చెందిన కొంతమందిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలన్నది చంద్రబాబు ప్రధాన డిమాండ్‌గా కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు లభించే శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో తన మాట చెల్లుబాటు కావాలన్నది చంద్రబాబు వ్యూహం. ఇప్పటికే చంద్రబాబు సూచనల మేరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎటూ ఆ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు తెలుగుదేశం పార్టీకే చెందిన కొందరిని కాంగ్రెస్‌లో చేర్పించి ఆ పార్టీ నుంచి టిక్కెట్‌ ఇవ్వాలన్న వ్యూహరచన చంద్రబాబు చేసినట్లు తెలిసింది. ఈ అవగాహన మేరకు తెలంగాణ టీడీపీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కొంత పాత్ర ఉండే అవకాశం ఉంది. 

శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్‌ తరపున పారిశ్రామికవేత్త 
టీడీపీ–కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా శ్రీకాకుళం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించాలన్నది చంద్రబాబు వ్యూహం. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా పేరు గడించిన ఓ పారిశ్రామికవేత్తను కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన సదరు పారిశ్రామికవేత్తతో సంప్రదింపులు కూడా జరిపారు. జాతీయ పార్టీలో చేరి ఎంపీగా గెలిస్తే పలు కాంట్రాక్టులు దక్కించుకోవచ్చని చంద్రబాబు ఆ పారిశ్రామికవేత్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోటీకి అవసరమైన విధంగా రూ.100 కోట్లు సమకూర్చుకోవాలని కూడా చంద్రబాబు సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరితోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరికొందరిని కాంగ్రెస్‌లో చేర్చి వారికి టిక్కెట్లు దక్కేలా చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కైకలూరు స్థానాన్ని బీజేపీకి ఇచ్చి టీడీపీ నేత కామినేని శ్రీనివాస్‌ను ఆ పార్టీలో చేర్చించి టిక్కెట్‌ ఇప్పించిన సంగతి తెలిసిందే. పేరుకే బీజేపీ తప్ప శ్రీనివాస్‌ ఏనాడు ఆ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన లేదు. మంత్రి పదవికి రాజీనామా చేసినా తెలుగుదేశం నేతలతోనే ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. ఇదే కోవలో కాంగ్రెస్‌ నుంచి కొందరికి టిక్కెట్లు ఇప్పించుకునేందుకు చంద్రబాబు ఇప్పట్నుంచే పావులు కదపడం మొదలుపెట్టారు. 

పత్రికాధిపతి సలహాలు 
రాహుల్‌గాంధీ సలహాదారు ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ పత్రికాధిపతితో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు సంబంధించి ఈ పత్రికాధిపతి అనేక సూచనలు చేసినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పత్రికాధిపతి ప్రభుత్వంలోనూ, పార్టీ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో తన మీడియా ద్వారా దగ్గరైన ఈ పత్రికాధిపతి గడచిన ఎన్నికలకు ముందు (2014) టీడీపీ, బీజేపీ మైత్రి కోసం కృషి చేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌తో చంద్రబాబును కలిపేందుకు రంగంలోకి దిగి నేరుగా రాహుల్‌గాంధీకి సలహాలు ఇస్తున్నారు.   

సంబంధిత కథనాలు

తల్లి కాంగ్రెస్‌-పిల్ల టీడీపీ; బండారం బట్టబయలు

ఒకే వేదికపై సోనియా, రాహుల్, చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement