ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాణప్రదమైనది. అది ఎవరి వల్ల సాధ్యమైనా హర్షించ వలసిందే. కానీ ప్రజల మనోభావాలపై ప్రబలమైన ప్రభావం వేయగల ఆవేశపూరితమైన ఈ అంశాన్ని ఆధారం చేసుకొని వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవాలని కానీ రాజకీయ ప్రయోజనం సాధించడంకోసం కానీ ప్రయత్నించేవారి యుక్తులను ప్రజలు గ్రహించాలి. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్న సద్భావన కాంగ్రెస్, బీజేపీలకూ, హోదాను ఏ విధంగానైనా సాధించాలనే పట్టింపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికీ ఉండి ఉంటే ఈ పాటికి అది అమలులో ఉండేది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం బిల్లుపైన రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంలో ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకరించిన నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ బిల్లులో ఆ అంశాన్ని చేర్చి ఉంటే ఎన్‌డీఏ సర్కార్ హోదా నిరాకరించినా న్యాయస్థానాలు న్యాయం చేసే అవకాశం ఉండేది. ఆ పని చేయకుండా ఎన్నికలు సమీపించిన తరుణంగా ప్రత్యేకహోదా ఫైలుపైన తొలి సంతకం చేస్తానంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పదేపదే ప్రకటించడం వల్ల ప్రయోజనం శూన్యం.
2014 ఎన్నికలలో విజయం సాధించి అట్టహాసంగా అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ పాత ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆదరించి హోదా మంజూరు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించేవారు. ఆ పని చేయకపోగా, ఏ పార్టీ అయితే పదేళ్ళు ప్రత్యేకహోదా కావాలంటూ రాజ్యసభలో గట్టిగా వాదించిందో అదే పార్టీ హోదా ఇవ్వకుండా ప్రత్యేకప్యాకేజీని రూపొందించడం వంచన. పోరాటం చేసి హోదాను సాధించవలసిన టీడీపీ నాలుగేళ్ళు అధికార కూటమిలో భాగస్వామిగా అంటకా గడం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఫల్యాలకు మూల్యం చెల్లించుకోవలసిన సమయం ఆస న్నమైనదని గ్రహించి కూటమి నుంచి వ్యూహాత్మకంగా నిష్క్రమించడం, ఆ తర్వాత ప్రత్యేకహోదా సాధన ఉద్యమం నిర్మిస్తున్నట్టు కనిపించాలని ప్రయత్నించడం కృతక రాజకీయం.
నరేంద్రమోదీ ఆదివారంనాడు గుంటూరు సభలో ప్రసంగించడానికి గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు అక్కడే ఆయనకు నల్లచొక్కా ధరించిన చంద్రబాబునాయుడు స్వాగతం చెప్పి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసన ప్రకటించి ఉంటే జాతీయ స్థాయి సంచలనమై ఉండేది. పద్ధతిగా ఉండేది. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కుమార స్వామి, తమిళనాడులో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్న డిఎంకె అధినేత స్టాలిన్ చేత సంతకాలు చేయించి ఒక వినతి పత్రాన్ని ప్రధానికి ఇచ్చి ఉన్నట్లయితే సముచితంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా మంజూరు చేయడంపట్ల తమకు అభ్యంతరం లేదని ఇరుగుపొరుగు రాష్ట్రాలు లిఖితపూర్వకంగా అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడు తుంది. సంవత్సరం కిందటి వరకూ ప్రత్యేకహోదా అక్కరలేదనీ, ప్రత్యేకప్యాకేజీని స్వీకరించాలనీ ఉద్బోధించింది తమరే కదా అంటూ చంద్రబాబునాయుడిని ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా ప్రశ్నించక పోవడం విశేషం. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నాయకులందరికీ ప్రధాని పట్ల వ్యతిరేకత ఉన్నది. ఎవరు వేదిక ఏర్పాటు చేసి ఆహ్వానించినా వారు వచ్చి మోదీని విమర్శించి వెడతారు. నిరసన వేదిక నుంచి ప్రసంగించిన వక్తలలో కొందరు మాత్రమే ప్రత్యేకహోదాను ప్రస్తావించారు. చాలామంది మోదీని దుయ్యబట్టి ప్రసంగాలు ముగించారు.
కాంగ్రెస్‌పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడితో మమేకమై పోయింది. రాహుల్‌గాంధీ స్వయంగా వేదికపైన కొద్దిసేపు కూర్చోవడమే కాకుండా గతంలో చంద్రబాబునాయుడు తీవ్రపదజాలంతో దూషించిన మన్మోహన్‌సింగ్, పునర్నిర్మాణ బిల్లు రూపొందించిన జైరాంరమేశ్ కూడా ప్రసంగించారు. సర్వసాధారణంగా గుజరాత్ వెలుపల సభలలో పాల్గొనని ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌పటేల్ చాలా సేపు ఒద్దికగా చంద్రబాబు నాయుడు సరసన కూర్చోవడం చాలామంది దృష్టిని ఆకర్షించింది. గులాంనబీ ఆజాద్, తదితర కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలందరూ చంద్రబాబునాయుడికి మద్దతుగా నిలవడం చిత్రం. ప్రత్యేక హోదా అక్కరలేదంటూ ప్రత్యేకప్యాకేజీకి ఒప్పుకోవడం తప్పేనని చంద్రబాబునాయుడు అంగీక రించి రాష్ట్రప్రజల క్షమాపణ కోరిన తర్వాతనే దీక్షకు రాహుల్‌గాంధీ మద్దతు ఇవ్వాలంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖను కాంగ్రెస్ అధిష్ఠానం ఖాతరు చేయలేదు. జాతీయ స్థాయిలో కలసి కార్యాచరణ ఉంటుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో టీడీపీ ఎన్నికల పొత్తు మాత్రం ఉండదంటూ స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్ నేతలు చంద్రబాబునాయుడి ముందు చేతులు కట్టుకొని నిలబడటం విచిత్రం.
ఇటువంటి ఏకపక్షమైన ఎన్నికల పొత్తు ఎక్కడైనా ఉంటుందా? ఎన్నికలకు ముందు రాహుల్‌ని కూటమి నాయకుడిగా ప్రకటించబోమనీ, ఎన్నికల తర్వాత ఏకగ్రీవంగా ఎవరినో ఒకరిని ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటామనీ చంద్రబాబునాయుడు అంటున్నప్పటికీ ఆత్మాభిమానాన్ని చంపుకొని కాంగ్రెస్ నాయకులు చంద్రబాబునాయుడిని సమర్థిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి యువభేరి సభలూ, నిరసన దీక్షలూ, నిరాహారదీక్షలూ, ఢిల్లీలో నిరశన, పాదయాత్ర సందర్భంగా జరిగిన సభలలో ప్రత్యేకహోదా గురించి నిరంతరం మాట్లాడటం వల్ల సాధారణ ప్రజలలో అవగాహన బాగా పెరిగింది. ప్రతిపక్ష నాయకుడికి జనాదరణ విశేషంగా పెరుగు తున్నదనే ఆందోళనతో అధికారపక్షం ఈ దీక్షా కార్యక్రమం చేపట్టింది. ఇది కేంద్ర ప్రభుత్వంపైన రాష్ట్రప్రభుత్వం చేస్తున్న పోరాటమనీ, అందుకోసం ప్రజలను ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా చేయ డానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడంలో తప్పు లేదనీ చంద్రబాబునాయుడు అనడం విడ్డూరం. ఎన్నికలు రెండు లేదా మూడు మాసాలు ఉన్నాయనగా ఎవరు ఏమి చేసినా, ఏమి చెప్పినా ప్రత్యేక హోదా నిరాకరణ కేసులో మొదటి ముద్దాయి టీడీపీ, రెండో ముద్దాయి బీజేపీ, మూడో ముద్దాయి కాంగ్రెస్ అనడంలో సంకోచం అక్కరలేదు.
Comments
Please login to add a commentAdd a comment