కమీషన్ల కోసమే...
చంద్రబాబు ‘ప్రత్యేక హోదా’ను తాకట్టు పెట్టారు : రాహుల్ గాంధీ
సాక్షి, అమరావతి: కమీషన్ల కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల మైదానంలో ‘ప్రత్యేక హోదా భరోసా సభ’ను నిర్వహించారు. ఈ సభకు హాజరైన రాహుల్‌గాంధీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికెంతో ప్రాధాన్యమైందిగా గుర్తించి ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా కేంద్రం నిధులు ఖర్చుచేసేలా చట్టంలో పొందుపరిస్తే చంద్రబాబు కమీషన్లకోసం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని తామే చేపడతామని చెప్పడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు.
కమీషన్ల భయంతోనే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమివ్వాల్సిన డబ్బులను పూర్తిస్థాయిలో ఇవ్వాలని చంద్రబాబు ధైర్యంగా అడగలేకపోతున్నారని ఆరోపించారు. 2019లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకుంటామని రాహుల్ ప్రకటించారు. ప్రధాని మోదీ హిందూ ధర్మ పరిరక్షణకోసం పాటు పడుతున్నట్లు చెబుతూనే.. తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే తర్వాత ఆ హామీని ఎందుకు వెనక్కు తీసుకున్నారో తెలియట్లేదన్నారు. దీన్ని హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడటమంటారా? అని ఎద్దేవా చేశారు.
మోదీకి భయపడుతున్నట్లుంది..
మోదీ ప్రభుత్వం అంటే ఇక్కడి పార్టీలకు ఏదో భయమున్నట్లు కనిపిస్తోందని, అందుకే వారు రాష్ట్ర ప్రయోజనాలపై ఒత్తిడి తీసుకురావట్లేదని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్‌తోపాటు ‘భరోసా వేదిక’పైన ఉన్న పార్టీలకు మోదీ అంటే భయం లేదని, అందుకే హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బాబు మానసిక స్థితి ఇలా అయిందని బాధేస్తోంది: సురవరం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేసేవారిని ప్రగతి నిరోధకులని చంద్రబాబు అనడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తప్పుపట్టారు. నాకు తెలిసిన చంద్రబాబు మానసిక స్థితి ఇలా అయినందుకు బాధేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని మాట్లాడుతున్న చంద్రబాబుకు రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు, ఎక్కడ సభ పెట్టుకున్నా కాళ్లు వణుకుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేంద్రంలోని ప్రభుత్వానికి సాగిలపడ్డారని విమర్శించారు. ఏపీకి హోదా సాధించే వరకు తమ మద్దతు కొనసాగుతుందని సీపీఐ ఎంపీ డి.రాజా అన్నారు.
టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలి: అఖిలేష్
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసిన టీడీపీ, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు. సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేక పోతున్నారని ప్రశ్నించారు.
మోదీకి పాలించే అధికారం లేదు
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన మోదీకి పాలించే అధికారం లేదని జేడీ(యూ) నేత శరద్‌యాదవ్ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లపాటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఆరోపించారు. అంతేకాక నల్లధనాన్ని బయటకు తీసి ఆ మొత్తాన్ని పేదల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పి ఒక్క పైసా కూడా ఇవ్వలేకపోయారన్నారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చేపట్టిన సభకు ప్రజలెవరూ వెళ్లవద్దని సీఎం హోదాలో అన్నందుకుగాను చంద్రబాబుకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేనేలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.
కాగా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఫోను ద్వారా మద్దతు తెలిపారని మాజీ ఎంపీ జేడీ శీలం సభలో తెలిపారు. సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు పవన్‌కల్యాణ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదా కోసం బలిదానం చేసుకున్న పలువురి కుటుంబాలకు రాహుల్ గాంధీ చేతులమీదుగా చెక్కులు పంపిణీ చేశారు. సభకు కేంద్ర మాజీమంత్రి మునియప్ప, నాయకులు దిగ్విజయ్‌సింగ్, కేవీపీ రామచంద్రారావు, పల్లంరాజు, సుబ్బిరామిరెడి తదితరులు హాజరయ్యారు. అయితే మాజీ కేంద్ర మంత్రి, పార్టీ ఎంపీ కె.చిరంజీవి హాజరవకపోవడం గమనార్హం.