సాక్షి, నల్గొండ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే రాజీనామా చేయగా, మరో వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు కీలక హోదాల్లో ఉన్న నేతలు బాధ్యత వహించాలన్న రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని తాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ఆయన వెల్లడించారు. ప్రెస్‌మీట్‌లతో ప్రజలు కనెక్ట్ కావడం లేదని, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని అన్నారు. ఎన్నికలప్పుడు బాధ్యతలలో ఉన్నవారు రాజీనామా చేయాలని రాహుల్ రాజీనామా చేశారని, అందుకే తాను కూడా రాజీనామా చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మొత్తం మీద రాజకీయంగా ఎప్పుడూ వార్తలో ఉండే రేవంత్ ఈసారి కూడా తనదైన శైలిలో రాజీనామాను ప్రకటించి అటు పార్టీలోనూ, ఇటు అధిష్టానం దృష్టిలోనూ చర్చనీయాంశం కావడం గమనార్హం. అలాగే మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. దీంతో రాహుల్‌కు మద్దతుగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లకు తోడు మరో సీనియర్ నేత రాజీనామా చేసినట్టయింది. మరికొందరు నేతలు కూడా నేడో, రేపో రాజీనామాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment