సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర సీపీఎంలో ఎడతెగని సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ప్రయోగాన్ని మధ్యలోనే వదులుకోవాలా లేక భవిష్యత్‌లో మంచి ఫలితాలు రావొచ్చుననే ఆశాభావంతో కొనసాగించాలా అన్న అంశంపై ఆ పార్టీలో ఏకాభిప్రాయం కుదరనట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సోదర కమ్యూనిస్టు పార్టీ సీపీఐతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు బీఎల్‌ఎఫ్‌ను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలన్న మీమాంసలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయే దాకా ఎంబీభవన్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఈ సమావేశంలో పాల్గొని సీపీఐతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలన్న జాతీయ నాయకత్వం సూచనలను రాష్ట్ర పార్టీకి తెలియజేసినట్టు సమాచారం.
కమ్యూనిస్టు సిద్ధాంతాలకు భిన్నంగా బీఎల్‌ఎఫ్ ఎజెండాను కొనసాగించిన పక్షంలో సీపీఎంతో ఎలాంటి ఎన్నికల సర్దుబాటూ ఉండదని సీపీఐ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీ మౌలిక సిద్ధాంతాలు, విధానాలకు భిన్నంగా బీఎల్‌ఎఫ్ పేరిట కులాల ప్రాతిపదికన అభ్యర్థులను నిలబెట్టడం, బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని గతంలో సీపీఎం కేంద్ర కమిటీ తప్పుబట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐతో కలిసి పోటీచేసేందుకు బీఎల్‌ఎఫ్‌ను వదులుకోవాలని రాష్ట్రపార్టీకి సీపీఎం నాయకత్వం సూచించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీపీఐ, సీపీఎంల మధ్య ఇప్పటికే రెండు విడతల చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. బీఎల్‌ఎఫ్‌ను పక్కనపెట్టడంతోపాటు, టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించాలనే రాజకీయ నినాదంతో పోటీచేయాలనే సీపీఐ సూచనల పట్ల సీపీఎం అభ్యంతరం వ్యక్తంచేసింది.
17 సీట్లకు పోటీకి పెట్టకుండా సీపీఐ, సీపీఎం, మిత్రపక్షాలు కలిసి పరిమితంగా పోటీచేసి, మిగతా స్థానాల్లో కాంగ్రెస్‌ను బలపరచాలన్న సీపీఐ సూచన పట్ల సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల జాతీయ నాయకత్వాలు ఢిల్లీ స్థాయిల్లో జరిపిన చర్చల్లో రాష్ట్రంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో సీపీఐ, సీపీఎంతోపాటు కలిసొస్తే తెలంగాణ జనసమితి, జనసేన, ఎంసీపీఐ(యూ), తదితర పార్టీలను కలుపుకుని పోవాలని రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వాలకు సూచించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు, పోటీచేసే సీట్లపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనుసరించాల్సిన విధానాలు, ఇతర పార్టీలతో చర్చలకు విధివిధానాలు, తదితర అంశాలపై ఒకటి, రెండురోజుల్లో స్పష్టత రావొచ్చునని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment