CMP leaders
-
బీఎల్‌ఎఫ్‌పై సీపీఎంలో తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర సీపీఎంలో ఎడతెగని సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రయోగాన్ని మధ్యలోనే వదులుకోవాలా లేక భవిష్యత్‌లో మంచి ఫలితాలు రావొచ్చుననే ఆశాభావంతో కొనసాగించాలా అన్న అంశంపై ఆ పార్టీలో ఏకాభిప్రాయం కుదరనట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సోదర కమ్యూనిస్టు పార్టీ సీపీఐతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు బీఎల్ఎఫ్ను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలన్న మీమాంసలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయే దాకా ఎంబీభవన్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఈ సమావేశంలో పాల్గొని సీపీఐతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలన్న జాతీయ నాయకత్వం సూచనలను రాష్ట్ర పార్టీకి తెలియజేసినట్టు సమాచారం. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు భిన్నంగా బీఎల్ఎఫ్ ఎజెండాను కొనసాగించిన పక్షంలో సీపీఎంతో ఎలాంటి ఎన్నికల సర్దుబాటూ ఉండదని సీపీఐ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీ మౌలిక సిద్ధాంతాలు, విధానాలకు భిన్నంగా బీఎల్ఎఫ్ పేరిట కులాల ప్రాతిపదికన అభ్యర్థులను నిలబెట్టడం, బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని గతంలో సీపీఎం కేంద్ర కమిటీ తప్పుబట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐతో కలిసి పోటీచేసేందుకు బీఎల్ఎఫ్ను వదులుకోవాలని రాష్ట్రపార్టీకి సీపీఎం నాయకత్వం సూచించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీపీఐ, సీపీఎంల మధ్య ఇప్పటికే రెండు విడతల చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. బీఎల్ఎఫ్ను పక్కనపెట్టడంతోపాటు, టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలనే రాజకీయ నినాదంతో పోటీచేయాలనే సీపీఐ సూచనల పట్ల సీపీఎం అభ్యంతరం వ్యక్తంచేసింది. 17 సీట్లకు పోటీకి పెట్టకుండా సీపీఐ, సీపీఎం, మిత్రపక్షాలు కలిసి పరిమితంగా పోటీచేసి, మిగతా స్థానాల్లో కాంగ్రెస్‌ను బలపరచాలన్న సీపీఐ సూచన పట్ల సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల జాతీయ నాయకత్వాలు ఢిల్లీ స్థాయిల్లో జరిపిన చర్చల్లో రాష్ట్రంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో సీపీఐ, సీపీఎంతోపాటు కలిసొస్తే తెలంగాణ జనసమితి, జనసేన, ఎంసీపీఐ(యూ), తదితర పార్టీలను కలుపుకుని పోవాలని రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వాలకు సూచించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు, పోటీచేసే సీట్లపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనుసరించాల్సిన విధానాలు, ఇతర పార్టీలతో చర్చలకు విధివిధానాలు, తదితర అంశాలపై ఒకటి, రెండురోజుల్లో స్పష్టత రావొచ్చునని సమాచారం. -
విపక్షాల ‘కామన్ మినిమమ్ ప్రొగ్రామ్’!
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కలిసి పనిచేసేందుకు పలువిపక్ష పార్టీలు అంగీకరించాయి. ఎన్నికల ముందు పొత్తు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని(కామన్ మినిమమ్ ప్రొగ్రామ్–సీఎంపీ) ఖరారు చేసుకోవాలని నిర్ణయించాయి. ఆప్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోజరిగిన ర్యాలీ అనంతరం విపక్ష నేతలు ఎన్సీపీ నేత శరద్ పవార్ ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. పరిస్థితుల మేరకు రాష్ట్రాల్లో వేరువేరుగా పోటీ చేయాల్సి వచ్చినా.. జాతీయ స్థాయిలో కలసి పని చేయాలని ఆయా పార్టీలు అంగీకరించాయి. సమావేశంలో ముసాయిదా సీఎంపీని పార్టీల నేతలకు పంపిణీ చేశారు. విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించాల్సిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఈ భేటీకి హాజరుకాలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. -
గడీల పాలన గద్దె దించే లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాల కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో ఉంచాల్సిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గడీల పాలనను గద్దె దించడమే లక్ష్యంగా అమరవీరుల ఆకాంక్షల ఎజెండా పేరుతో సీఎంపీ తయారు చేసేందుకు కూటమిలోని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందించగా వాటన్నింటినీ క్రోడీకరించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ వారంలో కసరత్తు పూర్తవుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కూటమిపక్షాన కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ని విడుదల చేస్తామని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో పరిగణనలోకి తీసుకోనున్న ముఖ్య ప్రతిపాదనలివే... ► అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ► రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ ► జిల్లాలు, జోనల్ వ్యవస్థలపై సమీక్ష ► 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ► గునీటి కాంట్రాక్టుల్లో ఈపీఎస్ వ్యవస్థ రద్దు, స్థానిక కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ► తొలి, మలి దశ ఉద్యమకారులకు గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం, పింఛన్ సౌకర్యం∙ ధర్నా చౌక్ పునరుద్ధరణ ► నిరుద్యోగులకు నెలసరి భృతి (రూ. 3 వేలు)కర్ణాటక తరహాలో లోకాయుక్త వ్యవస్థ బలోపేతం ► రూ. 10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ► రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధి ► ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపు ► పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ► ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు, రక్షిత మంచినీరు, బస్సు సౌకర్యం ► పెండింగ్‌లో ఉన్న మండల, డివిజన్ డిమాండ్ల పరిష్కారం ► అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత ► సంవత్సరంలోగా అమరవీరులకు స్మృతి వనం ► భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి, అర్హులందరికీ ఇచ్చేంత వరకు నెలకు రూ. 3 వేల ఆర్థిక సాయం ► బీసీ సబ్‌ప్లాన్ ► మైనార్టీల సంక్షేమం కోసం సచార్, సుధీర్ కమిటీల నివేదికల అమలు ► సింగరేణి, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఆసరా పింఛన్లు ► వ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ► ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ► అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్, వైద్య సౌకర్యం, గృహ వసతి, సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ► 5 సంవత్సరాలలోపు ప్రాక్టీస్ ఉన్న లాయర్లకు సైపెండ్ ► ఏటా ఉద్యోగ కేలండర్ ► అన్ని జిల్లా కేంద్రాల్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు ► విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ఎన్నారై శాఖ ► విత్తనం వేసే సమయంలోనే మద్దతు ధర ప్రకటన ► ఆదాయ భద్రత కోసం రైతు కమిషన్ ఏర్పాటు ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం... అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం ► మండల కేంద్రాల్లో ఐటీఐ/జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్/డిగ్రీ కళాశాల, జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీ, పీజీ సెంటర్ ఏర్పాటు ► మహిళ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు ► పట్టణాల్లో ఉచిత బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు ► 104, 108 సేవలు ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా కార్పొరేషన్ ఏర్పాటు ► ఇంటి పన్ను హేతుబద్ధీకరణ ► తెలంగాణ ఉద్యమ కళాకారులకు గుర్తింపు, తగిన వేతనం ► తెలంగాణ సినీ రంగానికి ప్రోత్సాహం, తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు పన్ను రాయితీ ► ఖాయిలా పడిన పరిశ్రమల పరిరక్షణకు విధానం ► నిజాం షుగర్స్, సిర్పూర్ పేపర్ మిల్లు, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ. -
ఉద్యమాలతో చంద్రబాబు గుండెల్లో దడ
తిరుపతి మంగళం : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, జనసేనపార్టీలు చేస్తున్న ఉద్యమాలతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ, సీపీఎం, సిపిఐ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల బైకు లతో నాలుగుకాళ్ల మండపం, కర్నాలవీధి, భేరివీధి, టౌన్‌క్లబ్, బాలాజికాలనీ, గాంధీరోడ్డు మీదగా తుడా సర్కిల్ వర కు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీతో ఇతర రాజకీయపార్టీలన్నీ జతకట్టి ఉద్యమాలు తీవ్రతరం చేయడంతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టి తాను ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానంటూ డ్రామాలు ఆడడం మొదలు పెట్టాడని మండిపడ్డారు. 16వతేదీన రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బంద్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు పోలీ సులతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చరిత్రలో ప్రజాద్రోహిగా నిలిచిపోతాడన్నారు. సీపీఎం నాయకులు కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జనసేన నాయకులు కిరణ్‌రాయల్ మాట్లాడారు. వైఎస్సార్సీపీ యువ నాయకులు భూమన అభినయ్, నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కే.బాబు, ఎస్కే.ఇమామ్, జ్యోతిప్రకాష్, రాజేంద్ర, కట్టా గోపీయాదవ్, ఆదికేశవులురెడ్డి, బాలిశెట్టి కిషోర్, మా ర్కెట్ వంశీ, తాలూరి ప్రసాద్, నరేంద్రనాథ్, పాముల రమేష్‌రెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, జాఫర్, చాంద్‌బాషా, మాధవనాయుడు, పుష్పాచౌదరి, రమణమ్మ, శ్యామల, పుణీత, సీపీఐ నేతలు పెంచలయ్య, రాధాకృష్ణ, ఎస్ఎఫ్ఐ నేత జయచంద్ర పాల్గొన్నారు. -
'సీపీఎం నేతల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు'
హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికల్లో సీపీఎం నేతల అక్రమాలపై టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. సీపీఎం నేతల అక్రమాలపై ఆదివారం ఎలక్షన్ కమిషన్‌కు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫిర్యాదు చేశారు. తెల్దారుపల్లి బూత్నంబర్లు 116, 117, 118 లో కొన్ని దశాబ్దాలుగా సీపీఎం నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని బాల్కసుమన్ ఆరోపించారు. ఏ పార్టీ నేతలు ఆ గ్రామానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఈసీ ఎదుట వాపోయారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గ్రామంలో ఆయన నేతృత్వంలో ఇదంతా జరుగుతోందని చెప్పారు. తమ్మినేని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ బాల్కసుమన్ విమర్శించారు.