సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఎంతో ప్రశాంతమైన జిల్లాలో అరాచకాలు సృష్టిస్తూ అధికార పార్టీ నాయకులు, పోలీసులు నిత్యం ప్రజల కోసం కష్టపడి పని చేసే చింతమనేని ప్రభాకర్‌పై కేసులు పెట్టి జైల్లో పెడతారా? పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని కనీసం ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అవసరమా? జిల్లాలో ముఠా నాయకులు, దోపిడీదారులు ఉన్నారా?’’ ఇది జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడి నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలు. తుందుర్రు ఆక్వాపార్కు వల్ల కాలుష్యం వస్తుందని ఆందోళన చేసిన తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామస్తులపై చేసిన నిర్బంధకాండను, తప్పుడు కేసులను చంద్రబాబునాయుడు మర్చిపోయారా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఆ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూడు గ్రామాల్లో నెలల తరబడి 144 సెక్షన్‌తో పాటు సెక్షన్ 30 అమలు చేశారు. గ్రామంలోకి ఎవరు వెళ్లినా, బయటకు ఎవరు వచ్చినా ఆధార్‌కార్డు, లేదా ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాల్సిందే. ఆరువేల జనాభా ఉన్న తుందుర్రలో ఆందోళనలను అడ్డుకోవడం కోసం ఆరువందల మంది పోలీసులను ఉపయోగించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పుకుంటూ సంతకం పెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనకారులపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఫ్యాక్టరీలో పనులు చేస్తున్న వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారనే అభియోగంపై ఏడుగురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఫ్యాక్టరీ వద్ద జరిగిన గొడవలో, పోలీసులను కొట్టారనే అభియోగంపై 37 మందిపై 307 సెక్షన్ కింద కేసులు కట్టారు, ఇందులో ఇతరులు అని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మహిళలను కూడా చూడకుండా నెలలతరబడి జైలులో పెట్టారు.
తుందుర్రు ఆక్వాపార్కు ఉద్యమకారులపై ఇప్పటివరకూ 33 కేసులు పెట్టారు. ఈ కేసులన్నీ పోలీసులు పెట్టినవే. ప్రజలు పెట్టినవి కాదు. ఆఖరికి భీమవరం సీఐతో సీఐని చంపడానికి వెళ్లారంటూ హత్యయత్నం కేసులు పెట్టించారు. అప్పుడు ఈ ఉద్యమాన్ని అణగదొక్కడానికి పోలీసులను ఇష్టారాజ్యంగా వాడారు. ప్రజలను కాపలా కాయడానికి ఉన్న పోలీసు వ్యవస్థను వాడుకొని వారిపైనే కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబునాయుడిదే. ఆ రోజు చట్టాలు ఏమయ్యాయని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఒక రౌడీషీటర్‌ను దౌర్జన్యం కేసులో అరెస్టు చేసి జైలులో పెడితే ఏదో అన్యాయం జరిగిపోయినట్లు బాధపడిపోతున్నారు. చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రౌడీ షీట్, 62 కేసులు ఉన్న వ్యక్తిని రాజకీయాలకు స్పూర్తి అని చెప్పడం ద్వారా తన వైఖరి ఏంటో చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్లు అయ్యింది. చింతమనేనిపై ఉన్న కేసులు, రౌడీషీటు అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో తెరిచినవే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment