
త్రిపురాంతకం (యర్రగొండపాలెం): కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులకు రాష్ట్ర సర్కార్ సరిగా లెక్కలు చూపడం లేదని, అందుకే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ఆమె మాట్లాడుతూ.. కేంద్రం ద్వారా అందుతున్న నిధులకు లెక్కలు చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్లు మారుతున్న తీరును తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల వివరాలు ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలిపితే నిధులు అదేస్థాయిలో వస్తాయన్నారు. రాజధాని విషయంలోనూ ప్రభుత్వం అదేతీరుతో ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.