
సాక్షి, చెన్నై : జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.
ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం ఆమె స్వతంత్ర్య అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆమె పేర్కొన్న అంశాలు అసంపూర్తిగా ఉన్నాయంటూ తెలిపారు. జయ మృతి తర్వాత ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పేరిట ఓ పార్టీని స్థాపించిన ఆమె.. ఆ సమయంలో జయకు అసలైన వారసురాలిని తానే అని ప్రకటించుకున్నారు. ఆపై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపొంది తీరతానని ధీమా వ్యక్తం చేశారు కూడా. కాగా, ఈసీ నిర్ణయంతో ఆమె ఎన్నికకు దూరమైనట్లయ్యింది.
ప్రస్తుతం ఆర్కే నగర్ కు పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు నటుడు విశాల్, ముఖ్యంగా బహిష్కృత నేత దినకరన్ ఈ ఎన్నికను సవాల్ గా తీసుకోవటంతో రాజకీయ వర్గాలు పోటీని ఆసక్తిగా తిలకించబోతున్నాయి. ఎన్నికల సంఘం డిసెంబర్ 21న ఎన్నిక, 24 న కౌంటింగ్ నిర్వహించనుంది.