
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధికి పాటుపడతారని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో నిర్వహించిన అన్నదాతల ఆశీర్వాద సభలో డీఎస్, అరవింద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాపు సంఘం ప్రతినిధులు అరవింద్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్‌కు అభినందనలు తెలిపారు. మున్నూరు కాపులను రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని ఆయన మండిపడ్డారు.
అరవింద్ మాట్లాడుతూ.. ఒక రైతు బిడ్డను ఎంపీగా గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అంటూనే.. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రైతులతో పెట్టుకోవడం వల్ల.. రాజు బిడ్డను ఇంటికి సాగనంపారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలనే కాకుండా, పేదల వ్యతిరేక పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే .. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ పట్టడం ఖాయమని అన్నారు.
అయితే చాలా రోజుల తర్వాత తండ్రీకొడుకులు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు తనపై కక్షగట్టారని ఆరోపించిన డీఎస్ ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరాతరనే వార్తలు వచ్చినప్పటికీ.. అవి నిజం కాలేదు. మరోవైపు డీఎస్ తనయుడు అరవింద్ మాత్రం తండ్రి టీఆర్‌ఎస్‌లో యాక్టివ్‌గా ఉన్న సమయంలోనే బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో నిలిచిన అరవింద్ కేసీఆర్ కూతురు కవితను ఓడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఆ ప్రయత్నాల్లో భాగంగా డీఎస్‌ను కూడా పార్టీలో చేర్చుకుంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment