
తిరువళ్లూరు: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవల చేసిన రాజకీయ ప్రకటన కామెడీగా షోగా మారిందని సినీ దర్శకుడు, నటుడు సీమాన్ వ్యాఖ్యానించారు. ముస్లిం మహిళలకు భద్రత పేరిట ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తిరువళ్లూరులోని ఈద్గా మైదానంలో శుక్రవారం రాత్రి భారీ బహిరంగ సభను నిర్వహించారు. జమాత్ ఉలామా కమిటీ సభ్యుడు దర్వేష్ రషాదీ హయరత్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా సీమాన్ హజరై ప్రసంగించారు.
ముస్లింలను అణచి వేయాలన్న ఉద్దేశంతోనే ట్రిపుల్ తలాక్ చట్టాన్ని హడావిడిగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని ఆరోపించారు. ముస్లిం మహిళల భద్రత పేరిట చేస్తున్న హడావిడికి బదులు ఎనిమిది కోట్ల మంది కోరుతున్న కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అహ్మదుసాలిక్, ముస్లింలు పాల్గొన్నారు.