కన్నడ నాట ‘సంకీర్ణ రాజకీయాలు’ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జేడీ(ఎస్)–కాంగ్రెస్ ఉమ్మడి సర్కార్‌లో భాగస్వాములుగా మారిన నేపథ్యంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ‘రాజకీయ డ్రామా’గా రక్తి కట్టిస్తున్నాయి. బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఈ రెండుపక్షాలు చేతులు కలిపినా, అప్పటి నుంచి ప్రతీరోజు ఏదో ఒక రూపంలో వీటి మధ్య లేదా ఆయా పార్టీల్లో అంతర్గత కీచులాటలు బయటపడుతున్నాయి. తాజాగా కర్ణాటకలో కేబినెట్ విస్తరణ అసమ్మతిని రాజేసేందుకు కారణమవుతోంది. ఎన్నికల అనంతరం కుదుర్చుకున్న పొత్తుతో ఏర్పాటైన ఈ ప్రభుత్వం ఇప్పుడు మంత్రిపదవుల కేటాయింపుల రూపంలో బాలారిష్టాలు ఎదుర్కుంటోంది.
కేబినెట్ కూర్పులో భాగంగా కాంగ్రెస్‌కు 15, జేడీ–ఎస్‌కు 10 పోస్టులు దక్కాయి. కులం,వర్గం, సీనియర్, జూనియర్, తదితర పరిమితుల్లో పదవులు దక్కని ఇరుపార్టీల నేతలు అసమ్మతి కుంపటిని రాజేసే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు వార్తలొస్తున్నాయి. కొందరు నేతలైతే తమ నాయకత్వాలపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటివి అంతర్గత ప్రజాస్వామ్యం కాసింత ఎక్కువగానే ఉన్న కాంగ్రెస్‌లో మరీ అధికంగా కనిపిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు వారాలే దాటిన నేపథ్యంలో ఇరుపార్టీలు ‘అసమ్మతి’ని మొగ్గలోనే తుంచేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
నిరసన జ్వాలలు...
మంత్రివర్గ జాబితా సిద్దమైందో లేదో దాంట్లో పేర్లు లేని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో విడిగా సమావేశమయ్యారు. మైసూరు, గడగ్, విజయపుర, కలబురగి తదితర ప్రాంతాల్లోని ఈ ఎమ్మెల్యేల మద్దతుదారుల నిరసనలు మిన్నంటాయి. ఇప్పటివరకు కేవలం జేడీఎస్ నుంచి సీఎం హెచ్‌డీ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర మాత్రమే ప్రమాణం చేశారు. దాదాపు రెండువారాల పాటు సాగిన విస్తరణ కసరత్తు తర్వాత కేబినెట్‌కు ఓ రూపునిచ్చేందుకు జరిగిన ప్రయత్నం కాస్తా పలువురు నేతలకు అసంతృప్తిని మిగిల్చింది. కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, ఆర్.రామలింగారెడ్డి, ఆర్. రోషన్‌బేగ్, హేచ్‌కే పాటిల్, శమనూరు శివశంకరప్ప, సతీష్ జర్కిహోళి వంటి వారికి ఇందులో చోటు దక్కలేదు.
మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితోనే ఉన్నామని ఏఐసీసీ కార్యదర్శిగానూ ఉన్న జర్కిహోళి పేర్కొన్నారు. ‘కేబినెట్ విస్తరణపై చర్చించిన తాము జరిగిన తప్పులను సరిదిద్దేందుకు రాష్ట్ర, జాతీయ నాయకత్వాల దృష్టికి సమర్థుల పేర్లను తీసుకెళతాం. దీనిపైనే రెండుసార్లు చర్చించాం. మరోసారి కూడా చర్చిస్తాం’ అని వెల్లడించారు. పార్టీ నేతలతో తాను సమావేశం కావడంలో తప్పేముందని, తాను ఆత్మగౌరవానికే అధిక ప్రాధాన్యతనిస్తానని, ఇది పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందంటూ మాజీమంత్రి పాటిల్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జేడీఎస్ నాయకత్వం కూడా కార్యకర్తల కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మంత్రుల జాబితాలో చోటు దక్కలేదని తెలుసుకున్న ఎంసీ మనుగులి మద్దతుదారులు హేచ్‌డీ దేవగౌడ ఇంటి వద్ద నిరసన వ్యక్తంచేశారు.
రొటేషన్ చక్రవర్తులు...!
పార్టీలో, ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసమ్మతిని అధిగమించడంతో పాటు మంత్రిమండలిలో మరి కొంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేందుకు వీలుగా కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఫార్మూలా తెరపైకి తీసుకొచ్చింది. ఈ రొటేషన్ ప్రణాళికలో భాగంగా మూడు పాయింట్ల ఫార్మూలా అమలుచేస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా తీసుకున్న వారిని రెండేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత కొత్త వారికి ఆవకాశం కల్పించడం... మంత్రుల శాఖల నిర్వహణపై ప్రతీ ఆరునెలలకు ఒకసారి పనితీరు ఆధార సమీక్ష నిర్వహించి సరిగా పనిచేయని వారికి ఉద్వాసన పలుకడం...ప్రస్తుతానికి మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడం, ఆరు కేబినెట్ పోస్టులు భర్తీ చేయకుండా అట్టే పెట్టడం... ఈ విధంగా మంత్రులను కార్యోన్ముఖులను చేయడంతో పాటు, ప్రతిభ చూపని వారి స్థానంలో మరికొందరికి మంత్రి పదవులు దక్కుతాయంటున్నారు.
నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి పేర్లను భవిష్యత్ విస్తరణలో పరిగణలోకి తీసుకోమంటూ పనిలో పనిగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే సిద్ధరామయ్య కేబినెట్‌లో కీలక సభ్యుడిగా ఉన్న కురుబ నేత హేచ్‌ఎం రేవణ్ణకు ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. మరోవైపు ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ వేచిచూస్తోంది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment