
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు : నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని, నూజివీడును ఎవరూ చేయనంత అభివృద్ధిని తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయడం జరిగిందని, దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన తోడ్పాటు చాలా గొప్పదని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు.
వాక్‌విత్ జగన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన పార్టీలో ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రజల మనిషినని, నిత్యం ప్రజలలో ఉండేవాడినని, రాబోయే ఎన్నికలలో తిరిగి గెలిచి నూజివీడు అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే నిధులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు.