బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నకిలీ ఓటరు కార్డులు కలకలం సృష్టించడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. కర్ణాటక ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడిగా డిప్యూటీ కమిషనర్ చంద్రభూషణ్ కుమార్‌ను నియమిస్తూ.. ఆయన్ని బెంగళూరుకు అత్యవసరంగా పంపించింది. మంగళవారం జరిగిన ఘటనపై విచారించి నివేదికను అందజేయాలని ఆదేశించింది. రాష్ట్రానికి చేరుకున్న చంద్రభూషణ్ అదే పనిలో నిమగ్నులయ్యారు. బెంగళూరుకు చేరుకున్న చంద్రభూషణ్ అధికారులతో కలిసి ఘటనపై ఆరా తీశారు. త్వరగా విచారణ చేపట్టి నేడో రేపో నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు.
బెంగళూరులోని రాజరాజేశ్వరి నియోజకవర్గంలో మంగళవారం అర్థరాత్రి దాదాపు 10 వేల నకిలీ ఓటరు గుర్తుంపు కార్డులు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికలకు మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘వాటి వెనకాల ఉన్నది మీ పార్టీవారే’నంటే.. కాదు మీ పార్టీ హస్తమే’ అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. కాగా అవి బోగస్ కార్డులు కావని, అసలైన కార్డుల్లాగే ఉన్నాయని ఈసీ తేల్చింది. అయితే అన్ని వేల కార్డులు ఒక్కచోట ఉండటమేంటన్న అంశంపై మాత్రం దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment