సాక్షి, తాడికొండ : ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ నాయకులు పలు ఎత్తుగడలు వేస్తారు. ప్రచారం ఊపందుకొన్న నాటి నుంచి ఓటింగ్ జరిగేంత వరకు డబ్బు, మద్యం ఎరజూపి ఓటర్లను మభ్య పెడుతుంటారు. అంతటితో ఆగకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ఎంతటి చర్యలకైనా వెనుకాడకుండా వారిని తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తారు.
ఇలాంటి వారి ఆగడాలను అరికట్టి వాళ్లు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) సీ–విజిల్ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా జరుగుతున్న అక్రమాలను సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంది.
అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకొనే వీలుండదు
సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన వారు తప్పించు కోవటానికి వీలుండదు. ఈ యాప్ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో కూడా ఇట్టే తెలిసి పోతుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఎన్నికల కమిషన్ గోప్యంగా ఉంచుతుంది. గత ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో ఈ యాప్‌ను ఉపయోగించి అధికారులు సత్ఫలితాలు సాధించారు. తెలంగాణ ఎన్నికల్లో దీనిని అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు.
ఫిర్యాదు చేయడం ఇలా..
- ఆండ్రాయిడ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో గూగూల్ ప్లేస్టోర్ నుంచి సీ–విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
- యాప్ ఓపెన్ చేయగానే వీడియో, ఫొటోలు అనే రెండు ఆప్షన్లు వస్తాయి.
- ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో అక్కడ సెల్‌ఫోన్లో నుంచి వీడియోల లేదా ఫొటోలు తీసి యాప్ ద్వారా పంపించవచ్చు.
- మద్యం, డబ్బుతో పాటు అనుమతి లేకుండా ర్యాలీలు, గోడల మీద రాతలు, జెండాలు పెట్టటం వంటివి ఏవైనా ఫిర్యాదు చేయవచ్చు.
- ఈ యాప్ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది.
- ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకొని జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత ఎన్నికల అధికారి లేక ఫ్లయింగ్ స్కాడ్స్‌కు సమాచారం అందిస్తారు.
- కేవలం 25 నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరుకొని అక్కడ విచారణ చేపడతారు.
- విచారణ అనంతరం ఫిర్యాదుదారునికి వారు పూర్తి చేసిన కార్యచరణను మెసేజ్ రూపంలో అందిస్తారు.
- ఈ తతంగం అంతా 100నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఫిర్యాదు చేసివారి పేర్లు ఎక్కడా బహిర్గతం కావు.
- పౌరులుగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవటానికి ఓటరుకు బ్రహ్మాస్త్రం సీ–విజిల్.
Comments
Please login to add a commentAdd a comment