టీఆర్‌ఎస్‌లోకి సురేశ్‌రెడ్డి | Ex Speaker Suresh reddy Ready To Join In TRS | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 8 2018 1:22 AM | Last Updated on Sat, Sep 8 2018 5:41 PM

Ex Speaker Suresh reddy Ready To Join In TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి ఈనెల 12న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మంత్రి కె.తారక రామారావు శుక్రవారంæ ఉదయం సురేశ్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లోకి రావాల్సిందిగా సురేశ్‌రెడ్డిని ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ ఆహ్వానాన్ని అంగీకరించిన ఆయన.. తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని వెల్లడించారు. 12న తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

సముచిత స్థానం కల్పిస్తాం: కేటీఆర్‌
సమైక్య రాష్ట్రంలో శాసనసభ స్పీకర్‌గా అందరి మన్ననలు పొందిన సురేశ్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించినట్లు కేటీఆర్‌ తెలిపారు. సురేశ్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఉద్యమ సమయంలో సురేశ్‌రెడ్డితో భావసారూప్యత ఉండేదని చెప్పారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్‌ ఆహ్వానాన్ని అంగీకరించి పార్టీలోకి వస్తున్న సురేశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో నిశ్శబ్ద అభివృద్ధి విప్లవం: సురేశ్‌రెడ్డి
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల నుంచి నిశ్శబ్ద అభివృద్ధి విప్లవాన్ని చూస్తున్నానని సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే టీఆర్‌ఎస్‌ ఆ హ్వానాన్ని అంగీకరించినట్లు చెప్పారు. వ్యవసాయం, సాగునీ టి రంగంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని, రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. టీఆర్‌ఎస్‌లోకి రావడంలో రాజకీయ లబ్ధి చూసుకోవడం లేదని ఆయన స్పష్టంచేశారు.

మండలి చైర్మన్‌గా సురేశ్‌రెడ్డి?
ఎన్నికలైన తర్వాత శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇవ్వడంతోపాటు చైర్మన్‌గా ఎన్నుకుంటామని సురేశ్‌రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే శాసనమండలికి పలువురు రిటైర్‌ అవుతున్నారు. ఆ జాబితాలో శాసన మండలి ప్రస్తుత చైర్మన్‌ స్వామిగౌడ్‌ కూడా ఉన్నారు. స్వామిగౌడ్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత సురేశ్‌రెడ్డికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. 1984లో మండల స్థాయి లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2004–09 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు స్పీకర్‌గా పనిచేశారు. 2009లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement