సాక్షి, హైదరాబాద్: ‘అయ్యా మీ సేవలు పార్టీకి అవసరం..మీలాంటి వారిని మేము ఆహ్వానిస్తున్నాం’ఇదీ ఎన్‌ఐఏ రిటైర్డ్ జడ్జి రవీందర్‌రెడ్డికి భారతీయ జనతాపార్టీ నేతల బృందం కొద్దిరోజుల కిందట వ్యక్తిగతంగా కలసి చేసిన విన్నపం.దీనికి అంగీకరించిన ఆయన ఈ నెల 15న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశారు. ఆ తర్వాత ఓ అయిదు రోజులకు ఎంపీ బండారు దత్తాత్రేయ ఫోన్‌చేసి ‘మీరు, మీ అనుచరులు కలసి పార్టీలో చేరడానికి జిల్లా బీజేపీ నాయకుల సాయంతో పార్టీ కార్యాలయానికి రండి ’అంటూ పిలిచారు. దత్తన్న నుంచి ఆహ్వానాన్ని అందుకున్న మరుచటి రోజే రవీందర్ రెడ్డి బీజేపీ రాష్ట్రకార్యాలయానికి తన అనుచరులతో వచ్చారు. తీరా అక్కడికి వచ్చాక తనను ఆహ్వానించిన దత్తన్న కానీ, పార్టీ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ గానీ కనిపించలేదు.
ఆందోళన చెందిన ఆయన విషయంపై ఆరా తీశారు. అప్పటికే సమాచారం రాబట్టిన అనుచరులు ‘మిమ్మల్ని ఇప్పుడే పార్టీలో చేర్చుకోవద్దని, రెండు రోజులు ఆగాలని అమిత్‌షా బండారు దత్తాత్రేయకు ఫోన్ చేశారట’అని రవీందర్ రెడ్డికి విషయం చెవిన వేయడంతో ఆయనకు కొద్దిసేపు ఏమీ పాలుపోలేదు. చివరకు సర్దుకొని విషయాన్ని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మీడియాతో మాట్లాడి విషయం చెప్పారు. ఈ సందర్భంగా ‘పార్టీలో చేరేందుకు రమ్మని.. వారెవరూ రాకుండా మిమ్మల్ని చేర్చుకోకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నారా..?’అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తానేమీ అవమానంగా భావించడం లేదన్నారు. తనను రమ్మని పిలచిన వారికి ఇది అవమానమన్నారు. జాతీయ భావాలు కలిగిన బీజేపీలో చేరాలని తనకు ఉందనీ అందుకే వచ్చానన్నారు. అయితే అధ్యక్షుడు అమిత్‌షా కొద్ది రోజులు ఆగమన్నారని చెప్పినట్లు తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ‘తరువాత రమ్మని పిలిస్తే చేరుతారా..’అని మీడియా అడగ్గా సమాచారం వచ్చాక నిర్ధారించుకొని పార్టీలో చేరుతానని సమాధానం ఇచ్చారు.
బ్రేకులు ఎవరు వేశారో...
బీజేపీలో వివిధ వర్గాలకు చెందిన వారు పార్టీలో చేరుతున్నప్పటికీ, కొంచెం ప్రాముఖ్యత ఉన్నవారూ, మేధావి వర్గానికి చెందిన వారూ పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచన ఇటీవల ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే రిటైర్డు జడ్జి రవీందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కొందరు రంగంలోకి దిగారు. ఆ మేరకు ఆయనను పిలిచారు. చివరి నిమిషంలో ఆ చేరికకు ఎందుకు బ్రే కులు పడ్డాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన చేరికను అడ్డుకున్నదెవరు? నిజంగా అమిత్‌షానే వద్దన్నారా? అనే విషయంలో పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర నేతల మధ్య సమన్వయలోపం వల్లే ఆయన్ని పార్టీలో చేర్చుకోలేదన్న వాదనలు వ్యక్తం అయ్యాయి. ఇదే అంశంపై బండారు దత్తాత్రేయను మీడియా ప్రశ్నించగా చిన్న సమాచార లోపం వల్ల అలా జరిగిందని పేర్కొనడం గమనార్హం.
రండి..చేరండి.. ఇప్పుడే కాదు ఆగండి..!
Published Tue, Sep 25 2018 2:41 AM | Last Updated on Tue, Sep 25 2018 1:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment