సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కవిత , పక్కన ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని, దీంతో అభివృద్ధి పనుల్లో జిల్లా ముందంజలో ఉందని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఎంపీ అధ్యక్షతన కటెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో జిల్లా డెవలప్‌మెంట్ కో ఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా గత సమీక్షల్లో చర్చకు వచ్చిన అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో యాక్షన్ టేకెన్ రిపోర్టును ఎంపీ అడిగి తెలుసుకున్నారు. మొదటగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై చర్చ జరిగింది. ఎంపీ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కింద నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని, నూటికి నూరుశాతం పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని డీఆర్‌డీఓను ఆదేశించారు.
అలాగే సామాజిక తనిఖీల్లో బయటపడిన రూ.358 కోట్లలో కేవలం ఇప్పటి వరకు రూ.155 కోట్లు మాత్రమే రికవరీ చేశారని, ఇంకా రూ.203 కోట్లు రికవరీ చేయాల్సి ఉందన్నారు. గ్రామాల్లో 1,622 సీసీ రోడ్ల పనులకు గాను రూ.88 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలల్లో ఒక్కోదానికి రూ.2 లక్షల వరకు వెచ్చించిన నిర్మిస్తున్న కిచెన్ షెడ్‌లు 77 ప్రోగ్రెస్‌లో ఉన్నాయన్నారు. వీటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది హరితహారంలో వెదురు మొక్కలను పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, జిల్లాలో ఐదెకరాల్లో ఈ మొక్కలను నాటడం ద్వారా సంబంధిత వృత్తిదారులకు ఉపాధి కల్పించినట్లుగా ఉంటుందన్నారు.
డ్వామా ఆధ్వర్యంలో 45 నర్సరీల్లో 40 లక్షల టేకు మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. జిల్లాకు మంజూరైన వైకుంఠధామాల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. వితంతు పెన్షన్ రావడం లేదని చాలా మంది వస్తున్నారని, ఎందుకు వారికి మంజూరు కావడం లేదో కారణాలు తెలుపాలని డీఆర్‌డీఓకు సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు లబ్ధిరులకు అందడంలో ఎదురవుతున్న చిన్నపాటి అడ్డంకులను తొలగించి ప్రక్రియను వేగవంతం చేశామన్నారు.
మూడు పీహెచ్‌సీల్లో షెడ్ల నిర్మాణం
పీహెచ్‌సీలకు వచ్చే రోగులు, వారి బంధువుల సౌకర్యార్థం డిచ్‌పల్లి, బాల్కొండ, నవీపేట్ పీహెచ్‌సీల్లో షెడ్ల నిర్మాణానికి రూ.17లక్షల చొప్పున మొత్తం రూ. 51 లక్షలను ఎంపీ ల్యాడ్స్ నుంచి మంజూరు చేస్తున్నట్లు ఎంపీ కవిత సమావేశంలో ప్రకటించారు. పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలతో పాటు సౌకర్యాలు కల్పించడానికి చర్య లు తీసుకుంటున్నామన్నారు.
భగీరథ ఏజెన్సీపై సీరియస్...
జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులపై చర్చ జరుగుతున్న సమయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేల బిగాల గణేష్ గుప్తా నగరంలో జరుగుతున్న పనుల జాప్యతపై ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తున్నందున నగరంలో ముందుగా భగీరథ పనులు పూర్తి చేసి నగరాన్ని దాటించాలని గత రెండు సమావేశాలతో పాటు ఏడాది కాలంగా చాలా సార్లు చెప్పినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారని వాపోయారు.
తద్వారా చాల సమస్యలు ఎదురవుతున్నాయని, వేసిన రోడ్లను మళ్లీ తవ్వాల్సిన పరిస్థితి నెలకొందని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎంపీ కవిత... సంబంధిత ఏజెన్సీ దారులను పిలిచి పనులు చేస్తారా..? లేదా..? అనే విషయం గట్టిగా నిలదీయాలని కలెక్టర్ రామ్మోహన్ రావును ఆదేశించారు. పనులు చేయకపోతే ఏజెన్సీని తొలగించి వేరే వారిని నియమించుకోవడానికి కూడా వెనుకాడవద్దని సూచించారు.
జిల్లాలో పసుపు సెల్ ఏర్పాటు...
జిల్లాకు పసుపు బోర్డు కోసం ప్రయత్నించగా జాతీ య కామర్స్ డిపార్ట్‌మెంట్ ఇవ్వలేమని చెప్పిందని, అయితే జిల్లాలో పసుపు సెల్ ఏర్పాటుకు ఆ శాఖ మంత్రి అంగీకారం తెలిపినట్లు ఎంపీ వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, సుధాకర్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, జేసీ రవీందర్ రెడ్డి, దిశా కమిటీ సభ్యులు ఎంపీపీలు, సర్పంచ్‌లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment