ఉత్తమ కలెక్టర్‌గా డాక్టర్‌ యోగితా రాణా | Best collector | Sakshi
Sakshi News home page

ఉత్తమ కలెక్టర్‌గా డాక్టర్‌ యోగితా రాణా

Published Sun, Aug 14 2016 10:42 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

ఉత్తమ కలెక్టర్‌గా డాక్టర్‌ యోగితా రాణా - Sakshi

ఉత్తమ కలెక్టర్‌గా డాక్టర్‌ యోగితా రాణా

  • నేడు గోల్కొండ కోటలో సీఎం చేతుల మీదుగా అవార్డు
  • ఏడాది పరిపాలనలోనే లక్ష్యాలు పూర్తి
  • ఉపాధిహామీ, హరితహారంలో రాష్ట్రంలో మొదటి స్థానం
  • ఇందూరు :జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణాను రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏడాది కాలంలోనే నిజామాబాద్‌ కలెక్టర్‌గా పని చేసిన యోగితారాణా ప్రభుత్వంతో, ప్రజలతో, ప్రజాప్రతినిధులతో భేష్‌ అనిపించుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన హరితహారం కార్యక్రమంలో జిల్లాకు విధించిన లక్ష్యాన్ని చేధించి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టారు. జిల్లాకు నిర్దేశించిన 3.35 కోట్ల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఈ నెల 13 నాటికే 3.36 కోట్ల మొక్కలు నాటించారు. ఇంకా మొక్కలు నాటింపజేస్తున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల కలెక్టర్‌ల పనితీరుతో పోలిస్తే కలెక్టర్‌ యోగితా రాణా అన్ని విధాలుగా ముందంజలో ఉన్నారని, పనితీరు, తపనను గుర్తించిన ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ కలెక్టర్‌గా ఎంపిక చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో నిర్వహించే స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా  యోగితా రాణా అవార్డును అందుకోనున్నారు. అయితే ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా నిజామాబాద్‌ కలెక్టర్‌కు అవార్డుకు రావడం జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. ఉత్తమ కలెక్టర్‌గా ఎంపిక కావడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
    ఏడాది పూర్తయిన కానుకగా...
    గత కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ తరువాత జిల్లాకు కలెక్టర్‌గా యోగితా రాణా వచ్చారు. 2015 ఆగస్టు 14న బాధ్యతలు స్వీకరించారు.  కలెక్టర్‌ వచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఏడాదిలోనే కాలంలోనే ఆమె జిల్లా పరిపాలనపై పట్టు సాధించారు. ప్రభుత్వ పథకాల అమలు, అధికారులచే పనులు వేగవంతం చేయడంపై దృష్టిసారించారు. ఉపాధిహామీలో జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టి అవార్డును అందుకున్న యోగితా రాణా, ప్రస్తుతం హరితహారం కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లాను మరో సారి రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టారు.
     విద్య, వైద్యం, సంక్షేమం పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి పనుల్లో, పథకాల్లో పురోగతి తీసుకువచ్చారు. మాతా,శిశు మరణాల రేట్లను తగ్గించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో గతంలో కంటే భిన్నంగా మంచి ఫలితాలు రాబట్టారు. సుడిగాలి పర్యటనలు, తనిఖీలతో జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను, ఉద్యోగులను మందలించి, పలువురిపై వేటు కూడా వేశారు. ఏడాది పరిపాలన, పని తనానికి రాష్ట్రం ప్రభుత్వం ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా అవార్డును ఇవ్వడం కానుకగానే అనుకోవచ్చు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement