
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం... అదే సమయంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రం నుంచి కనీసం ఐదు ఎంపీ సీట్లను దక్కించుకోవాలన్న లక్ష్యంతో కసరత్తు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఢిల్లీలో గురువారం రాత్రి రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్‌షా బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిందేనని, ఇతర పార్టీ నేతలు పార్టీలోకి వచ్చే వాతావరణాన్ని సృష్టించాలని, వలసలను ఆకర్షించాలని స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
కరీంనగర్ నుంచి మురళీధర్‌రావు?
గత ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసిన సీహెచ్ విద్యాసాగర్‌రావు మొత్తం పోలైన ఓట్లలో 19.06 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావును పోటీ చేయించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఆయన కరీంనగర్ లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమేనన్న సంకేతాలను జాతీయ నాయకత్వం ముందుంచినట్లు తెలియవచ్చింది.
ఇక నిజామాబాద్ నుంచి పోటీ చేసిన యెండల లక్ష్మీనారాయణ 21.79 శాతం ఓట్లతో మూడో స్థానంతోనే సరిపెట్టుకోగా మెదక్ నుంచి పోటీ చేసిన నరేంద్రనాథ్ పోలైన ఓట్లలో 15.3 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. మల్కాజిగిరిలో మిత్రపక్ష టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి గెలుపొందగా ఈసారి బీజేపీ మల్కాజిగిరి నుంచి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ భగవంత్‌రావుకు 32.05 శాతం ఓట్లు వచ్చాయి. ఇది ఎంఐఎం కంచుకోట కావడంతో ఇక్కడ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది.
మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసిన డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి 26.86 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ విజేతగా నిలిచిన టీఆర్‌ఎస్‌కు 32.91 శాతం ఓట్లు దక్కగా, రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు 32.66 శాతం ఓట్లు దక్కడం గమనార్హం. భువనగిరి నుంచి పోటీ చేసిన పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి 15.11 శాతం ఓట్లతో మూడో స్థానంలోనే నిలవగా వరంగల్‌లో 15.90 శాతం ఓట్లతో కమలం మూడో స్థానానికే పరిమితమైంది.
నల్లగొండలో మిత్రపక్షమైన టీడీపీ బరిలో నిలిచి రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి నల్లగొండలో బీజేపీ బరిలో దిగనుంది. కేంద్ర జలవనరులశాఖ సలహాదారుగా, రాజస్తాన్ జలవనరులశాఖ సలహాదారుగా ఉన్న వెదిరె శ్రీరాంరెడ్డి నల్లగొండ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో ఒకసారి ఇక్కడి నుంచి ఆయ న బరిలోకి దిగారు. ఇక ఖమ్మంలో టీడీపీ 34.51 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచినా బీజేపీ ఇక్కడ బలంగా లేదు.
ఎక్కడెక్కడ ఎంతెంత బలం?
ప్రధానంగా నగర ప్రాంతాలపై బీజేపీ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, భువనగిరి, మెదక్, నల్లగొండ, హైదరాబాద్ స్థానాలు ఉన్నా యని విశ్వసనీయంగా తెలియవచ్చింది. గత సాధారణ ఎన్నికల్లో 8 లోక్‌సభ స్థానాల్లో (సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్, భువనగిరి, మహబూబ్‌నగర్) పోటీ చేసిన బీజేపీ సికింద్రాబాద్ నుంచే గెలుపొందింది.
అయితే 2019లో ఈ 8 స్థానాలతోపాటు మల్కాజ్‌గిరి, నల్లగొం డ స్థానాలకూ పోటీపడి కనీసం ఐదిం టిని దక్కించుకోవాలన్న వ్యూహంతో బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహం రచిస్తోంది. గత ఎన్నికల్లో 43.62 శాతం ఓట్లతో సికింద్రాబాద్ సీటును గెలుచుకున్న దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తప్పించడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేనట్టేనని పార్టీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇక్కడి నుంచి కిషన్‌రెడ్డిని రంగంలోకి దింపాలని అధినాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కిషన్‌రెడ్డికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment