సాక్షి, తిమ్మపాలెం : గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిపాలన కాలంలో ఏ ఒక్క రైతు ముఖంలో సంతోషం లేకుండా పోయిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా అక్కాచెల్లెమ్మలను, రైతులను, యువకులను, నిరుద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. తన పాదయాత్ర సాగుతున్న అడుగడుగునా రైతులు తమ సమస్యల గోడును చెప్పుకుంటున్నారని, వారి సమస్యలు మరింత లోతుగా తెలుసుకునేందుకు రైతులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 93వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం, తిమ్మపాలెంలో జరిగిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ మాట్లాడారు.
'ఈ నాలుగేళ్లలో ఏ రైతు ముఖంలో సంతోషం లేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు ఎంతగా మోసం చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కాచెల్లెమ్మలను, రైతులను, యువకులను, నిరుద్యోగులను మోసం చేశారు. వ్యవసాయ రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాటతప్పారు. ఆయన చేసిన కాస్తంత మాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోదు. గత ప్రభుత్వాలు రైతన్నలకు వడ్డీలేకుండా రుణాలు ఇచ్చాయి. ఎందుకంటే ప్రభుత్వాలే అప్పట్లో రైతు రుణాలపై వడ్డీలు కట్టేవి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వడ్డీలు కట్టేయడం మానేసింది.. దీంతో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు. నాలుగేళ్లుగా రైతన్నలకు గిట్టుబాటు ధరలేదు. శెనగ, మినుములు, కంది, పొగాకు, జామాయిల్ ఇక్కడ ఎక్కువగా వేస్తారు.
కానీ, వాటి ఉత్పత్తి అయ్యే ఖర్చులో సగం ధర కూడా మార్కెట్లో లభించే పరిస్థితి లేదు. చంద్రబాబు హెరిటేజ్ దుకాణాలకు రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తక్కువ ధరకు కొని ప్యాకింగ్‌లు చేసి ఆకాశాన్నంటే ధరలకు అమ్మేస్తున్నారు. దళారీలా నాయకుడిగా మారి చంద్రబాబు రైతులను తాకట్టు బెడుతున్నారు. పొగాకు రైతన్న పరిస్థితి దారుణం. నాన్నగారి (దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి) హయాంలో కేజీ పొగాకుకు రూ.120 రాగా ఇప్పుడు పదేళ్లు గడుస్తున్నా.. ఇప్పుడు మాత్రం కేజీ రూ.116కు పడిపోయిందని రైతులంటున్నారు.
ఇక్కడ రబీ పంట ఎక్కువగా వేస్తారు.. కానీ ప్రస్తుతం కరువు పరిస్థితి కనిపిస్తోంది. కరువు మండలాలపై ప్రభుత్వం మాత్రం లెక్కలు వేయట్లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టేందుకు ఈ పనిచేయట్లేదు. ఖరీఫ్‌కు కట్టాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇప్పటి వరకు కట్టలేదు. రైతుల దగ్గర నుంచి మాత్రం తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటిని గమనించి ఏం చేస్తే రైతన్న ముఖంలో చిరునవ్వు వస్తుందని ఆలోచించి నవరత్నాలు ప్రకటించాం.
రైతు వ్యవసాయం చేసే సమయంలో ప్రధాన సమస్య పెట్టుబడి. వారి పెట్టుబడి ఖర్చు తగ్గితే ఆదాయం పెరుగుతుంది. అందుకోసం నవరత్నాల ద్వారా మొదట చేయబోయేదేమిటంటే..
1. ప్రతి రైతన్నకు ఉచితంగా తొమ్మిదిగంటలు పగటి పూట ఉచిత విద్యుత్.
2. రైతులకు వడ్డీలేకుండా రుణాలు ఇస్తాం.. ఆ వడ్డీ డబ్బులు ప్రభుత్వమే కడుతుంది
3. జూన్ మాసంలో ప్రతి రైతు నాగలిపట్టి వ్యవసాయానికి సన్నద్దమవుతాడు కాబట్టి ప్రతి రైతుకు తోడుగా ఉంటూ మే నెలలో రూ.12500 ఇస్తాం.
4. కోరిన ప్రతి రైతన్నకు ఉచితంగా బోర్లు వేయిస్తాం
5. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉండేలా గిట్టు బాట ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్‌లు, నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. 'పాడి ఉన్న ఇంట సిరులు నిండునట.. కవ్వం తిరుగు ఇంట కరువుండదట'. ఒకప్పుడు లాభాల్లో ఉన్న కోఆపరేటివ్ డైరీలు చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇప్పుడు నష్టాల్లో నడుస్తున్నాయి. ఇదంతా చంద్రబాబునాయుడు ఒక పథకం ప్రకారమే చేయిస్తున్నారు. దళారీ నాయకుడిలా మారి చంద్రబాబు రైతులను బతకనిచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. మన ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం' అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment