
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ఫలితాలు వచ్చి 40 రోజులు గడిచినా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు.ఆదివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మొత్తం 90 మంది సభ్యులున్నారు. కానీ సీఎం, హోంమంత్రితోనే పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వమంటే సమష్టి నిర్ణయమని చట్టం చెబుతోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, నెల రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.
ఆ తర్వాత మున్సిపల్, జెడ్పీ ఎన్నికలూ జరిగే అవకాశముంది. ఇలా ఎన్నికల కోడ్‌తో అనేక కార్యకలాపాలు నిలిచి పోయే ప్రమాదముంది. మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో పాలన కుంటుపడే పరిస్థితి ఉంది’ అని గండ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇక గవర్నర్ ప్రసంగం ఎన్నికల్లో కేసీఆర్ ప్రసంగాన్ని తలపించిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెడితే, అందులోనుంచి కొన్ని వ్యాధులను తొలగించారని తెలిసిందన్నారు.
బాబు పప్పులుడకలేదు: బలాల
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో సాఫీగా జరిగాయని ఎంఐఎం సభ్యుడు అబ్దుల్లా బలాల అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోదీలు వచ్చినా బీజేపీ ఎన్నికల్లో గట్టెక్కలేక నామరూపాలు లేకుండా పోయిందన్నారు. ఏపీని వదిలి ఇక్కడకు వచ్చి ప్రచారం చేసిన అక్కడి సీఎం చంద్రబాబుకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్ ఫెడర ల్ ఫ్రంట్‌కు ఎంఐఎం మద్దతు ఇస్తుందన్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు రాష్ట్రాభివృద్ధిని తెలిపాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment