
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటంతోపాటు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జీలు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది.
శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నవంబర్ 6న ప్రారంభించే ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో ఆలోచిద్దామని, పార్టీ అధినాయకత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ శిరసావహించాలని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే, కానీ హామీల అమలు మాత్రం అసెంబ్లీ గేటు కూడా దాటడం లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ ఎద్దేవా చేశారు. ఈ నెల 30న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి జరిపే పర్యటనపై నాయకులు చర్చించారు. వర్షాల కారణంగా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో పాడైన పత్తి పంటలను పరిశీలించి, బాధిత రైతులను శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించనున్నారు.
వర్షాల వల్ల తడిసి, రంగు మారిన పత్తి పంటకు మద్దతు ధర కల్పించాలని, పత్తికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కరీంనగర్, చొప్పదండి పత్తి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.రాంభూపాల్ రెడ్డి, మతీన్ ముజాద్దీన్‌తోపాటు ముఖ్య నేతలు డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి, వెల్లాల రాంమోహన్, ఎన్.రవికుమార్, విశ్వనాథ్‌చారి, బండారు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment