
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో కష్టపడి పండించిన వరి, మినుములు, వేరుశనగ పంటలను మార్కెట్ యార్డులకు తరలించి రైతులు పడిగాపులు కాస్తున్నారని, వాటిని కొనే నాథుడే లేడని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని సీఎం కేసీఆర్ సదస్సులు పెట్టి గొప్పగా చెప్పారని, కానీ సమితులకు నిధులు కేటాయించకుండా, వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన వరి పంటను మార్కెట్ యార్డులకు తరలించారని.. ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనకపోవడంతో కురిసిన వర్షాల కారణంగా తడిసి ముద్దయి రైతులు నష్టపోయారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.