
'పంటరుణాలను పూర్తిగా మాఫీ చేయాలి'
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి, ఆదుకోవాల్సి బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు. బుధవారం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాయలంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జిల్లాల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు చేసే సీఎం కేసీఆర్ రైతుల విషయంలో మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరించటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తిరిగి రుణాలు వచ్చేలా రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.
వర్షాలు సకాలంలో పడనందున రైతులు విత్తిన విత్తనాలు మెలకెత్తలేదని, కొన్ని చోట్ల అరకొర మొలకెత్తిన ఆకాల వర్షాలకి నీట ముగిపోయాయని తెలిపారు. ఆకారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద ఎకరాకు రూ.10 వేలు చెల్లించాలని తెలిపారు. వేలాది ఎకరాలు నీట మునిగి రైతుల కన్నీరు పెడుతున్నారని చెప్పారు. 2004 తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే అతిత్వరలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల యాత్ర చేయనున్నట్లు చెప్పారు. జిల్లాల వారిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి నెలా జిల్లాల, మండలాల కార్యవర్గ సమావేశాలు తప్పక నిర్వహించాలని చెప్పారు.
పార్టీ నిర్మాణ విషయాలపై దృష్టి సారించాలి...
రాష్ట్రంలోని జిల్లాల అధ్యక్షులు, పార్టీ జిల్లా పరిశీలకులు, ప్రధాన కార్యదర్శులు ఇక నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేయాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇకపై అందరూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. అక్టోబర్ 15 లోగా గ్రామ స్థాయి కమిటీలు, పార్టీ అన్ని అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు పూర్తి చేయాలని కోరారు.
వీర జవానులకు సలాం...
సభ ప్రారంభంలో ఉరీలో సైనిక శిబిరంపై ఆదివారం జరిగిన తీవ్రవాద దాడి ఘటనలో అమరులైన జవాన్లకు సమావేశం ఘన నివాళులర్పించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దేశం యావత్తు ఇలాంటి సమయంలో ఒకటై ముందుకు సాగాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె. శివకుమార్, జి. మహేందర్ రెడ్డి, మతిన్, కె. రాంభూపాల్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి (మహబూబ్ నగర్), గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి (మెదక్), బెంబడి శ్రీనివాసరెడ్డి( రంగారెడ్డి), బొడ్డు సాయినాథ్ రెడ్డి( గ్రేటర్ హైదరాబాద్), ఎం. శాంతకుమార్( వరంగల్), అక్కెనపల్లి కుమార్ ( కరీంనగర్), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), తుమ్మలపల్లి భాస్కర్ (నల్లగొండ), మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృత సాగర్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష నర్రా బిక్షపతి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.