
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఫైల్‌ఫోటో
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను తాను మత ప్రాతిపదికన రెచ్చగొట్టినట్టు బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. గుల్బర్గాలో జరిగిన ప్రచార సభలో ముస్లింలు ఇస్లాం పేరుతో ఓటు వేయాలని తాను పిలుపు ఇచ్చినట్టు బీజేపీ నేతలు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. తాను ముస్లింలతో ప్రత్యేకంగా సమావేశం కాలేదని, బహిరంగ సభలోనే ప్రజలనుద్దేశించి మాట్లాడానని వివరణ ఇచ్చారు. తాను ఇస్లాం పేరిట ఓటు వేయాలని ముస్లింలకు పిలుపు ఇచ్చానని చెబుతున్నట్టు ఆడియో, వీడియో ఆధారాలను ఈసీకి సమర్పించాలని ఆయన సవాల్ విసిరారు.
బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటర్లు ఓటేయాలని ఆజాద్ కోరినట్టు బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకే ముస్లింలు మూకుమ్మడిగా ఓటు వేయాలని ఆజాద్ ఆ సభలో పిలుపు ఇచ్చారని పేర్కొంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో ఆ పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు సీనియర్ నేతలు మతం కార్డును ప్రయోగిస్తున్నారని బీజేపీ నేతలతో కూడిన బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారని, కాంగ్రెస్‌కు ఓటు వేయడం ద్వారా ఇస్లాంకు సేవలందించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. ఆజాద్‌పై ఈసీ కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment