యాచారం : తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీని చట్టానికి విరుద్ధంగా ఏర్పాటు చేస్తుంది, నింబంధనలను తుంగలో తొక్కి కాలుష్యంతో ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందని కాం గ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో శుక్రవారం ఫార్మా భూబాధితులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
భూసేకరణ చట్టం 2013కు విరుద్ధంగా రైతుల నుంచి భూసేకరణ చేయడమే కాక, రాళ్లు, రప్పల పేరుతో ఇచ్చే పరిహారాన్ని కూడా న్యాయంగా అందజేయలేదన్నారు. చట్టానికి విరుద్ధంగా జరిగిన భూసేకరణ వల్ల కోర్టుల్లో రైతులకే న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులు మళ్లీ ఫార్మాకిచ్చిన భూముల్లో సాగు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పట్టాదారు, పాసుపుస్తకంలో ఉన్న ఎకరాలకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా రైతులను నష్టాలకు గురి చేసిందని మండిపడ్డారు.
ఫార్మా పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం రైతులకు మాత్రం తక్కువ పరిహారం ఇచ్చి వారి జీవోపాధికి కల్పించే సాగు భూములను లాక్కోవాలని చూస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆటలు సాగనీవ్వమని హెచ్చరించారు. ఫార్మాసిటీలో వందలాది విష కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందన్నారు. చట్టం రైతులకు అనుకూలంగా ఉంది ఏ మాత్రం భయపడొద్దని సూచించారు.
పలువురు న్యాయవాదులు పాల్గొని చట్టానికి విరుద్ధంగా చేపడుతున్న ఫార్మాసిటీ వల్ల న్యాయస్థానాల్లో ఏ విధంగా అనుకూలమైన తీర్పులు వస్తాయో తెలిపారు. కార్యక్రమంలో నక్కర్తమేడిపల్లి సర్పంచ్ భాషా, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పర్యావరణవేత్త సరస్వతి , పలు పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment