సాక్షి, ముంబై : శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈనెల 25న తలపెట్టిన అయోధ్య పర్యటనకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ వేసినట్లే కనిపిస్తోంది. పర్యటనకు అనుమతివ్వాలని చాలారోజుల క్రితమే యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ను శివసేన పార్టీ నాయకులు కలసి విన్నవించినా ఇప్పటిదాకా అనుమతి ఇవ్వకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది. దీంతో ఉద్ధవ్ అయోధ్య పర్యటన వివాదాస్పదమయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శివసేన పార్టీ శ్రేణులు పూర్తిచేశాయి. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా అనుమతివ్వలేదనే విషయం వెలుగులోకి రావడంతో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, పదాధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
దసరా రోజునే ప్రకటన..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావస్తోంది. ఆయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై వాద ప్రతివాదనలు సుప్రీంలో కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు ఉద్ధవ్ జోక్యం చేసుకుని ఈ నెల 25న అయోధ్య పర్యటనకు వెళ్లనున్నట్లు శివాజీపార్క్ మైదానంలో విజయదశమి రోజున జరిగిన దసరా మేళావాలో ప్రకటించారు. రామ మందిరం నిర్మాణానికి ఇటుక పేరుస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రకారం ఈ నెల 24న మధ్యాహ్నం ముంబై నుంచి బయలుదేరడానికి అవసరమైన ఏర్పట్లన్నీ దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పర్యటనను విజయంవంతం చేయడానికి పార్టీ శ్రేణులు శక్తినంత కూడగడుతున్నాయి. శివసేన నాయకులు కూడా తమ ప్రతిష్టను ఫణంగా పెట్టి ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య పర్యటనను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
బీజేపీ కావాలనే చేస్తోంది..
ఉద్ధవ్ తలపెట్టిన అయోధ్య పర్యటన ఒకవేళ విజయవంతమైతే వచ్చే ఎన్నికల్లో శివసేనకు మంచి ఫలితాలు వస్తాయని, ఇది బీజేపీకి మింగుడు పడటం లేదని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఒకట్రెండు రోజుల్లో యూపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి లభించే అవకాశాలున్నాయనే దీమాతో శివసేన నాయకులున్నారు. ఇప్పటికే శివసేన సీనియర్ నాయకుడు అనీల్ దేశాయ్ అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకుంటున్నారు. 24వ తేదీ సాయంత్రం ఉద్ధవ్ అయోధ్య చేరుకున్న తరువాత ఆయన చేతుల మీదుగా సరయూ నదీ తీరం వద్ద పూజలు చేయనున్నారు. అక్కడే మహా హారతీ నిర్వహిస్తారు. ఈ తంతు సుప్రీం కోర్టు నిఘాలో ఉంటుంది. 25న రామ జన్మభూమి స్థలాన్ని సందర్శిస్తారు. తరువాత బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్రం బయట ఉద్ధవ్ ఠాక్రే భారీ సభ జరగడం ఇదే ప్రథమం.
ఒకవైపు అయోధ్య రామమందిరం విషయం బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం, మరోవైపు రామమందిరం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో ఉద్ధవ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
సుప్రీం అనుమతిచ్చినా..
ఉద్ధవ్ పర్యటనలో ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్ధేశంతో శివసేన ఎంపీ, పార్టీ ప్రతినిధి సంజయ్ రావుత్ రెండు వారాల కిందటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ పర్యటనకు సంబంధించిన అన్ని అనుమతులు జారీ చేస్తామని ఈ భేటీలో యోగి హామీ ఇచ్చారని శివసేన చెబుతోంది. కానీ, ఇప్పుడు కావాలనే కాలాయాపన చేస్తున్నట్లు తెలుస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సరయూ నదీ తీరంలో జరిగే కార్యక్రమాలన్నింటికీ సుప్రీం కోర్టు అనుమితులిచ్చింది. కానీ, అయోధ్య నగర నిగం, జిల్లాధికారుల నుంచి ఆ పత్రాలు లభించలేదు. దీనిపై గత బుధవారమే నలుగురు ఎస్టాబ్లిష్‌మెంట్ కమిషనర్‌లతో సమావేశం జరగాల్సి ఉంది. కానీ, ఆ సమావేశం ఇంతవరకు జరగకపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య పర్యటనకు అధికారికంగా అనుమతి లభిస్తుందా..? లేదా..? అనే అంశం ఉత్కంఠగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment