
సాక్షి, అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాజీ మంత్రి నారాయణ అప్రూవర్‌గా మారి వాస్తవాలు చెబితే స్వాగతిస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. 29 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నా నారాయణ కనిపించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అమరావతిలో అక్రమాలు నారాయణ చెప్పాలనుకుంటే చెప్పొచ్చని, చంద్రబాబు నుంచి ఎలాంటి హానీ లేకుండా రక్షణ కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గురువారం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
'మాజీ మంత్రి నారాయణ కనిపించడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారో బయటకు రావాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి సీఆర్డీఏ పరిధిలో అప్పటి మంత్రి నారాయణ పని చేశారు. అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నా ఆయన మాత్రం కనిపించడం లేదు. అసలు అమరావతిని ఇలా ఎందుకు నిర్మించారో మాజీ మంత్రి నారాయణ చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు నిన్న (బుధవారం) విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన వెంట అనుచరులు తప్ప, రైతులెవరు మాకు కనిపించలేదు. ఒక అసాంఘిక శక్తిగా చంద్రబాబు కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల నుంచి దృష్టి మరల్చేందుకే బాబు యత్నించారు. రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ బాబు అండ్ కో బాగా నటించారు. కొనుకున్న భూములకు రేట్లు రావాలనేదే వారి తాపత్రాయం.
అమరావతి జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ కాదు.. జాయింట్ యాక్టింగ్ కమిటీ. ఎందుకంటే ఆ కమిటీలో ఉన్న వారంతా యాక్టర్లే. రాజధాని పేరుతో చంద్రబాబు ఎన్ని కోట్లు తిన్నారనేది ప్రతీ ఒక్కరికి తెలుసు. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి. చంద్రబాబు మాట్లాడితే జైలుకి పంపండి అంటున్నాడు.. ఆయనకు ఆ కోరిక త్వరలోనే తీరనుంది. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. అమరావతి పేరిట కోట్ల రూపాయాల పెట్టుబడులు పెడితే మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. మీ ప్రభుత్వ హయాంలో పట్టిసీమ పేరుతో ఎన్ని కోట్లు కుమ్మరించారో మాకు తెలియనది కాదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయమని ఎన్నిసార్లు అడిగినా అప్పట్లో పట్టించుకోలేదు.
చంద్రబాబు పట్టిసీమ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేసింది. ఆయన తన అవసరాల కోసం రాజధాని భూముల రేట్లు పెంచేందుకే నానా యాగీ చేస్తున్నారు. విశాఖపై చంద్రబాబు, రామోజీరావు విషం చిమ్ముతూ అమరావతి కోసం ఆర్టికల్స్ రాస్తున్నారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? గత అయిదేళ్లలో టీడీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు దోచుకున్నారు. త్వరలో టీడీపీ నేతలు చేసిన అవినీతిని బయటపెడతాం. ఇక పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ కమెడియన్. ఆయనకు ప్రజలు వాతలు పెట్టినా ఇంకా కవాతు అంటున్నారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్యే. ఇది తెలుగు ప్రజల సమస్య కాదు’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
(విశాఖ అంటే బాబుకు ఎందుకంత ద్వేషం?)
Comments
Please login to add a commentAdd a comment