సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మీరైమైనా అందగాడా.. లేక శోభన్ బాబు అనుకుంటున్నారా.. మిమ్మల్ని కలవడానికి ఎవరైనా ఇష్టపడతారా అంటూ అనకాపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన గురించి పిచ్చోడి చేతిలో రాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో బాబు పాలనలో జనాలు స్వయంగా అనుభవించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబును చూసి వైఎస్సార్ భయపడ్డారంటా.. గొప్పల కోసం బాబు మరి ఇంత దిగజారుతారనుకోలేదు అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చిన సందర్భం ఒక్కటైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు మతి పోయిందో.. మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు మందు అలవాటు లేదు.. కానీ ఓడిపోయిన తర్వాత ఏమైనా మారిపోయారా అంటూ అమర్‌నాథ్ అనుమానం వ్యక్తం చేశారు.
తన కుమారుడు లోకేష్ భవిష్యత్తు ముగిసిపోయందనే బాధతోనే చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖ గురించి కలలు కన్నానని చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని మండి పడ్డారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను చంద్రబాబే దెబ్బ తీశారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎవరెవరికి ఏమి దోచిపెడదామా అన్న ప్రయత్నాలే చేశారు కదా అని విమర్శించారు. అప్పట్లో వైఎస్ హయాంలో మాత్రమే విశాఖ అభివృద్ధి జరిగింది.. మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ హయాంలో అభివృద్ధి జరగబోతుందని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం నేతలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబులా పెయిడ్ ఆర్టిస్ట్‌లతో పబ్లిసిటీ చేయించుకున్న నేతలేవరిని చూడలేదని అమర్‌నాథ్ విమర్శించారు. ఎమ్మార్వో వనజాక్షిని, చింతమనేని జుట్టుపట్టుకుని కొడితే.. చంద్రబాబే స్వయంగా సెటిల్ చేశారన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై హత్యా ప్రయత్నం జరిగితే.. వైసీపీ నాయకులే చేయించారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని మండి పడ్డారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు నెలల పాలనలోనే ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి దేశంలో గొప్ప ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు నవ్వుకునేలా మాట్లాడవద్దంటూ చంద్రబాబుకు సూచించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని నిలబెట్టుకోలేక తమపై విమర్శలు చేయడం తగదన్నారు అమర్‌నాథ్.
Comments
Please login to add a commentAdd a comment