కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్( పాత చిత్రం)
శంషాబాద్ : అర్ధరాత్రి గన్‌మెన్లను తొలగించడం మమ్మల్ని హత్య చేసేందుకేనని అనర్హత వేటుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు ఆరోపించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వారు కేంద్ర ఎన్నికల కమిషనర్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు ఎయిర్‌పోర్టులో విలేకరులతోమాట్లాడుతూ.. టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్, ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని అనుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు.
కాంట్రాక్టులు ఆంధ్రాప్రాంత నాయకులకు ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గవర్నర్ కుర్చీలను లాగేసి, శాసనమండలిలో టేబుల్‌పై ఎక్కి కొట్టినప్పుడు ఎవరినీ కూడా అనర్హులుగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే హక్కు ఈయనకు ఎక్కడిదని సూటిగా అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment