సాక్షి, భువనగిరి: దుబ్బాక ఉప ఎన్నికలు స్వేచ్చగా.. పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర బలగాలను పంపాల్సిందిగా కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం లేఖ రాశారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మార్గంలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని... మంత్రి హరీశ్ రావు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని, ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని కూడా పంపి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. అంతేగాక రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులను తక్షణమే దుబ్బాక నుంచి తరలించేలా చూడాలన్నారు. అదే విధంగా ఇతర జిల్లాల అధికారులను దుబ్బాకకు పంపి ఎన్నికలు స్వేచ్ఛగా.. పారదర్శకంగా నిర్వహించేలా చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment