ఎంపీగా రాజీనామా చేయించండి | GVL Narasimha Rao comments on Chandrababu and CM Ramesh | Sakshi
Sakshi News home page

ఎంపీగా రాజీనామా చేయించండి

Published Sat, Oct 20 2018 4:02 AM | Last Updated on Sat, Oct 20 2018 4:02 AM

GVL Narasimha Rao comments on Chandrababu and CM Ramesh - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం రమేశ్‌తో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సీఎం చంద్రబాబును బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. అలాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం రమేశ్‌తో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించకపోతే ఆయన్ను తొలగించాల్సిందిగా ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. జీవీఎల్‌ శుక్రవారం విజయవాడలో బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేస్తారని ముందే తెలిసి అంతా సర్దుకున్నప్పటికీ టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ కంపెనీల్లో రూ.100 కోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని జీవీఎల్‌ అన్నారు. ఈ మేరకు అధికారులు గుర్తించినట్టు జాతీయ దినపత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తోపాటు కొన్ని జాతీయ టీవీ ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయని గుర్తు చేశారు. జీవీఎల్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

‘వందల కోట్లలో, వేల కోట్లలో అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది. దొరికిన రూ.వంద కోట్లకు సీఎం రమేశ్‌ జవాబు చెప్పాలి. తానేదో సత్యహరిశ్చంద్రుడినని ప్రగల్భాలు పలికాడు. మగాడిని అంటూ మీసం తిప్పాడు. ఈ రోజున సగం మీసం అయినా తీసేస్తాడా? ఎడ్కో ఇండియా అనే కంపెనీ పెట్టి, దాని వ్యవహారాలన్నీ రమేశ్‌ కార్యాలయంలోంచే నడుపుతున్నారు. రమేశ్‌ అకౌంటెంట్‌ దగ్గరే ఆ కంపెనీలకు సంబంధించిన స్టాంపులు, మెయిల్స్‌ ఉన్నాయి. అంటే మీ (సీఎం రమేశ్‌) ఆఫీసులోనే ఒకరిని డమ్మీగా కూర్చోబెట్టి, మరికొందరు డమ్మీ డైరెక్టర్లను పెట్టి, మీరే ఈ చేతితో డబ్బు ఇచ్చి, ఆ చేతితో డబ్బు వెనక్కి తీసుకోవడం చేశారు. మొత్తం వంద కోట్ల దుర్మార్గం బయటపడింది. ఈ డబ్బంతా తెలుగుదేశం పార్టీ పెద్దలు చేసిన రాజకీయ వ్యాపారానికి ఉపయోగించిన డబ్బేనా? ఆ డబ్బుతో ఏం కొనుగోలు చేశారు? ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు నడిపారా? 23 – 24 మంది ఎమ్మెల్యేలు ఊరికే రారు కదా! చాలా ఖర్చుతో కూడుకున్నది కదా! ఎమ్మెల్యేల కోనుగోలులో సీఎం రమేశ్‌ పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ చేపట్టాలి. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో అందరూ అవినీతిపరులనే అపోహ ఉంది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులపై ఐటీ అధికారుల పరిశీలన జరగాలని కోరుకుంటున్నా. ఒకప్పుడు సైకిల్‌ తొక్కినవాళ్లు ఇప్పుడు రూ.వేల కోట్లకు అధిపతులయ్యారు.

పెద్దల సభకు దిగజారుడు మనుషులా? 
సీఎం రమేశ్‌ అంటే ఏపీ ప్రజలంతా ముఖ్యమంత్రి గారి రమేశ్‌ అని, మరికొందరు ముఖ్యమంత్రి బినామీ అని చెబుతుంటారు. టీడీపీ నుంచి పదేపదే రాజ్యసభకు పంపడానికి ఆయనకున్న అర్హత అదేనని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులను దిగజారుడు వ్యక్తులను పెద్దల సభకు పంపి పార్లమెంట్‌ను అవమానపరిచినందుకు చంద్రబాబు సైతం క్షమాపణ చెప్పాలి. సీఎం రమేశ్‌తో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించాలి. లేదంటే  ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేసి, అతడిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతా. గతంలో పార్లమెంట్‌లో ఓటుకు నోటు కుంభకోణంలో ఉన్నవారిని ఎథిక్స్‌ కమిటీ ద్వారా పదవుల నుంచి తప్పించారు.

లోకేశ్‌ శాఖలో రూ.వేల కోట్లు లూటీ
చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు సంబంధించిన ఐటీ శాఖలో ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన బినామీ సంస్థలకు, కొన్ని షెల్‌ కంపెనీలకు రూ.వేల కోట్లు దోచిపెడుతున్నారు. విశాఖలో ఐటీ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే భూములను మూడేళ్లలో వారు అమ్ముకోవచ్చట! అంటే ఇదంతా లూటీనే కదా. కంపెనీ పేరు ఒక్కటే నిజం, మిగిలిందంతా దోపిడీయే.  ప్రభుత్వం ఐటీ రాయితీలు ఇచ్చిన కంపెనీల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? రాష్ట్రానికి ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. కానీ, విజయవాడలోని పటమట స్థాయి కంపెనీలు వచ్చినట్టు ఉన్నాయి. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి తాము సిద్ధమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపాల్సిన నివేదికలను చంద్రబాబు ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. మీరు(టీడీపీ పెద్దలు) చేయాల్సింది చేయరు, డ్రామాలు చేస్తారు, ధర్మ పోరాటాల పేరుతో ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటారు’ అని జీవీఎల్‌ నరసింహారావు దుయ్యబట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement