
సాక్షి, చెన్నై: ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఇప్పటిది కాదని, ఈ నిర్ణయం అమలు, దీని ప్రభావం విషయాల్లో తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు.
నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దు
జీవితంలో ఎంత ఎత్తకు ఎదిగినా.. నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎక్కడిని వెళ్లినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం తనకు అలవాటని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానంపై ‘లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్’ పేరుతో వెంకయ్య పుస్తకం రాశారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకయ్య నిర్వహించిన 330 ప్రజాకార్యక్రమాలతో పుస్తకాన్ని ప్రచురించారు. అమిత్ షాతోపాటు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.