సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు 13 రోజులు, 61 గంటలపాటు జరిగాయని శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలసి టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పద్దులు, బిల్లులు, అంశాలపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. సభానాయకుడిగా సీఎం కేసీఆర్ సుమారు ఐదు గంటలు మాట్లాడారని చెప్పారు. పద్దులపై 20 గంటలపాటు చర్చ జరిగిందన్నారు.
గత సమావేశాలతో పోలిస్తే ఈసారి అన్నింటిపైనా సమగ్రంగా చర్చ సాగిందని, మొత్తం 11 బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. పేదలకు అసైన్‌మెంటు భూములపై హక్కులు కల్పిస్తూ ఆమోదించిన బిల్లు చరిత్రాత్మకమైందని అభివర్ణించారు. 4,380 కొత్త పంచాయతీల ఏర్పాటు.. లంబాడీలు, ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుందని హరీష్‌రావు చెప్పారు. తండాలను పంచాయతీలుగా చేస్తామని కాంగ్రెస్ నేతలు గతంలో హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద సాయాన్ని లక్షా 116 రూపాయలకు పెంచుతూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పేదలకు భరోసానిచ్చిందని పేర్కొన్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరమని, కాంగ్రెస్ సభ్యుల స్వయంకృతాపరాధం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. కొట్టడానికే కాంగ్రెస్ సభ్యులు శాసనసభకు వచ్చారని ఆరోపించారు. భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ నేతలు హుందాగా, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.
ఎవరూ అడగకుండానే సమావేశాలను రెండు రోజులు పొడిగించామన్నారు. తెలంగాణ సభలు దేశానికి ఆదర్శంగా ఉండాలనేది టీఆర్‌ఎస్ విధానమని పేర్కొన్నారు. గతంలో శాసనసభ సమావేశాలు జరిగితే ఖాళీబిందెలు, ఎండిపోయిన పంటలతో ప్రతిపక్షాలు వచ్చేవని హరీశ్ గుర్తుచేశారు. కరెంటు, నీళ్ల సమస్యను రూపుమాపినందుకే ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment