
సాక్షి, వనపర్తి/గద్వాల: తెలంగాణ గడ్డపై జరిగిన బహిరంగ సభకు హాజరైన సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్‌పై వరాలు కురిపించారని.. మేడ్చల్‌లో సభ జరిగిన తీరును చూస్తే తెలంగాణలో ఉన్నామా.. లేక అమరావతిలోనా? అనే అనుమానం కలిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జిల్లా మక్తల్ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరులో రోడ్డు షో, అమరచింతలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. అలాగే గద్వాల నియోజకవర్గం ధరూరులో జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటును చివరి నిమిషం వరకు చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని హరీశ్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అడ్డుపెట్టుకుని సీలేరు పవర్ ప్లాంట్ లాక్కున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కరెంటు బిల్లులు తగ్గించాలని అడిగిన రైతులను కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు. అలాంటి బాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం గర్హనీయమన్నారు. ప్రజలు మాయాకూటమి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. గెలిచే పార్టీ అయిన టీఆర్‌ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ పోటీ ద్రోహులతోనే..
తెలంగాణ వాదులు, తెలంగాణ ద్రోహుల మధ్య ఈ ఎన్నికల్లో పోటీ జరుగుతోందని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణవాదులపై అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న, ప్రస్తుత మక్తల్ మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డి దాడి చేశారని గుర్తు చేశారు. అప్పట్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర సాధన కోసం మూకుమ్మడిగా రాజీనామాలు చేసినా దయాకర్‌రెడ్డి మాత్రం జిరాక్స్ పేపర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు పథకాన్ని ఆపాలంటూ బాబు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా తెలంగాణలో జరిగే అభివృద్ధి ఇష్టంలేని బాబు కాంగ్రెస్ ముసుగు వేసుకుని వస్తున్నందున ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
ఉర్దూలో మాట్లాడిన మంత్రి
ఆత్మకూరు, అమరచింతలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు హరీశ్ ఉర్దూలో మాట్లాడారు. షాదీ ముబారక్ పేరుతో ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష అందిస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుదని, మైనార్టీల్లో పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్రంలోనూ టీఆర్‌ఎస్ పార్టీ కీలకం కానుందన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపుతోపాటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సభల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, మక్తల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాట తప్పం.. మడమ తిప్పం
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మాట తప్పని, మడమ తిప్పని పార్టీ టీఆర్‌ఎస్ అని హరీశ్‌రావు అన్నారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో ధరూర్, గట్టు, కేటిదొడ్డి మం డలాల మహిళలు శనివారం మహిళా ఆశీర్వాద సభ నిర్వహించారు. హరీశ్ మాట్లాడుతూ, గద్వాల జిల్లా ఏర్పాటు తన ఘనతనే అని డీకే అరుణ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్పుడు ఎందుకు జిల్లా ఇవ్వలేదని ప్రశ్నిం చారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ, కృష్ణమోహన్‌రెడ్డి లేకపోతే జిల్లా ఏర్పాటు అయ్యేదా అని అన్నారు. ఆడబిడ్డలకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. ఓటర్లు మద్యం, డబ్బుకు లొంగకుండా కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించి గద్వాలను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని పిలుపునిచ్చారు.