ఓటు మాటల్లో నీటి గలగలలు | Joint Mahbubnagar district politics around the irrigation water | Sakshi
Sakshi News home page

ఓటు మాటల్లో నీటి గలగలలు

Published Sat, Dec 1 2018 3:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Joint Mahbubnagar district politics around the irrigation water - Sakshi

‘కేఎల్‌ఐ’లో భాగంగా తీగలపల్లి వద్ద కొనసాగుతున్న రిజర్వాయర్‌ పనులు

వలసల జిల్లా పాలమూరులో ఎన్నికల పోరు రక్తి కడుతోంది. టీఆర్‌ఎస్, కూటమి అభ్యర్థులు నువ్వా–నేనా అన్నట్టు తలపడుతున్నారు. హోరాహోరీ ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నారు.  ప్రధానంగా సాగునీటి అంశం చుట్టూనే పాలమూరు రాజకీయం సుడులు తిరుగుతోంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి ఈ జిల్లా ఆధిక్యం అందిస్తోంది. మొత్తం 14 స్థానాలకు.. 2014లో టీఆర్‌ఎస్‌ 7, టీడీపీ 2, కాంగ్రెస్‌ 5చోట్లా  గెలిచాయి. నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేల చేరికతో టీఆర్‌ఎస్‌ బలం 9కి పెరిగింది. ఈ ఎన్నికల్లో.. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ముందున్న పార్టీలే గెలుపోటములను నిర్దేశిస్తాయి.

ఎత్తిపోతలతోనే ఉపయోగం
నారాయణపేట– కొడంగల్‌ ఎత్తిపోతల చేపడితే కృష్ణా నది నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరం నుంచే సాగునీరు లభిస్తుంది. అదే పాలమూరు రంగారెడ్డి ద్వారా చేపడితే 300 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. ఈ విషయం ఆలోచించాలి.
– అనంత్‌రెడ్డి, జలసాధన సమితి అధ్యక్షుడు

చేనేతకు చేయూత కావాలి
గద్వాలలో హ్యాండ్లూమ్‌ పార్క్‌ పనులు ఊపందుకోవాలి. పార్క్‌లో ఇంటి స్థలం ఇచ్చి, మగ్గంతో చీర నేశాక ప్రభుత్వమే వాటినే కొనాలి. ప్రతి కార్మికునికి  సిల్క్‌పై ఇచ్చే రూ.600 రాయితీని పునరుద్ధరించాలి. సిరిసిల్ల మాదిరే గద్వాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
– మ్యాడం రామకృష్ణ, గద్వాల, చేనేత కార్మికుడు

విద్య, వైద్యం, సాగునీరు..
రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు డిపో బస్సులు రావడం లేదు. నష్టాల్లో ఉందని గద్వాల డిపో బస్సులు వేయదు. ఆర్డీఎస్‌ కాల్వల పనులు తొందరగా పూర్తి కావాలి. అలంపూర్‌లో  రవాణా, విద్య, వైద్యం, సాగునీటి వసతిని పెంచాల్సి ఉంది.
– నందు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు, అలంపూర్‌

జీవో 98 కింద ఉద్యోగాలివ్వాలి
శ్రీశైలం ముంపు నిర్వాసితులకు జీవో 98ను అమలు చేయాలి. 11,192 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో చొరవ చూపాలి. పరిహారం విషయంలోనూ శ్రద్ధ చూపాలి. నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం వెంటనే ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి.
– ఖాజా మొహినొద్దీన్, శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుడు, కొల్లాపూర్‌

నారాయణ‘పేట’లోని మొనగాళ్లు
ఇక్కడ ప్రధాన పోటీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి మధ్యే ఉంది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో.. శివకుమార్‌రెడ్డి రైతు నాగలి గుర్తుపై పోటీలో ఉన్నారు. ఇక, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో టిక్కెట్‌ దక్కించుకున్న సరాఫ్‌ కృష్ణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో ఉన్నా రు. అయితే జైపాల్‌ వర్గం నేత కావడంతో డీకే అరుణ వర్గం కృష్ణకు మద్దతివ్వడం లేదు. ఆమె వర్గమంతా శివకుమార్‌రెడ్డికే మద్దతిస్తోంది. గత ఎన్నికల్లో శివకుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి 2,200 ఓట్ల తేడాతో ఓడారు. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయన బలంగా ప్ర జల్లోకి వెళుతున్నా, ఎన్నికల గుర్తు ఎంతవరకు ప్రజలకు చేరుతుందన్నది ముఖ్యం. కొడంగల్‌–నారా యణపేట ఎత్తిపోతల పథకం విష యం టీఆర్‌ఎస్‌ను కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇటీవల తన పర్యటనలో నారాయణపేటను జిల్లా చేస్తామన్న కేసీఆర్‌ ప్రకటన రాజేందర్‌కు కొత్త బలాన్నిస్తోంది. ఇక్కడ మూడో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి.

గద్వాల్‌: అత్తా అల్లుడి సవాల్‌
కాంగ్రెస్‌ ముఖ్య నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ ఏళ్లుగా డీకే కుటుంబానిదే ఆధిపత్యం. మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 15 సార్లు డీకే కుటుంబానిదే పైచేయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన డీకే భరతసింహారెడ్డి మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డిని మరోమారు టీఆర్‌ఎస్‌ బరిలో దింపింది. గద్వాలలో బోయ వాల్మీకీలు 40 వేలు, కురుమలు 35 వేల మంది వరకు ఉన్నారు. ఈ రెండు కులాల మొగ్గుని బట్టే గెలుపోటములు ఉండనున్నాయి. బోయ వాల్మీకీలను ఎస్టీల్లో చేరుస్తామని చేర్చకపోవడాన్ని ప్రధానంగా డీకే అరుణ ప్రస్తావిస్తూ వారిని మచ్చిక చేసుకున్నారు. ఇక గొర్ల పథకాన్ని తెరపైకి తెచ్చి కురుమలను టీఆర్‌ఎస్‌ దగ్గర చేసుకుంది. గద్వాల పట్టణంలో 55 వేల ఓట్లున్నాయి. గత ఎన్నికల్లోనూ పట్టణ పరిధిలో వచ్చిన ఆధిక్యమే అరుణ విజయానికి దోహదపడింది. ఈసా రీ ఆమెకే అనుకూలంగా కనిపిస్తోంది. అమలు కాని హామీలను ప్రధాన ప్రచారా స్త్రాలుగా చేసుకుని అరుణ ముందున్నారు. ఇక గ్రామీణ ప్రాంత ఓటర్లే లక్ష్యంగా కృష్ణమోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. అసంతృప్తివాదులను సర్దుబాటు చేసుకుని వెళుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ పర్యటనలో వరాల జల్లు కురిపించడం తనకు అనుకూలిస్తుందని ఈయన భరోసాతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కొంతకాలంగా హరీశ్‌రావు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు.

జడ్చర్ల: ‘నాడి’ పట్టేదెవరు?
జడ్చర్లలో తాజా మాజీ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి హ్యాట్రిక్‌ కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ ముది రాజ్, యాదవ, ఎస్సీ కమ్యూనిటీ ఓటర్లున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక జడ్చర్లలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలతోపాటు 100 పడకల ఆస్పత్రి, ఇతర అభివృద్ధి పనులు తన విజయానికి దోహదం చేస్తాయని లక్ష్మారెడ్డి భావిస్తున్నారు. దళితులకు మూడెకరాలు, మైనార్టీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు అంశాన్ని మల్లు రవి ఎత్తిచూపుతున్నారు. ఈయన కాంగ్రెస్‌ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇప్పటికే ఆయన సినీ నటి ఖుష్బూతో ప్రచారం నిర్వహించగా, మరో భారీ సభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ వైపు ఉన్న బీసీలు.. టీఆర్‌ఎస్‌ వైపు చూస్తుండటం కాంగ్రెస్‌కు ప్రతిబంధకంగా మారింది. కర్వెన, ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్లతో 1.50లక్షల ఎకరాలకు సాగునీరిస్తామన్న కేసీఆర్‌ హామీ లక్ష్మారెడ్డికి బలంగా పనిచేసే అవకాశాలున్నాయి. 

రసకందాయంలో ‘కందనూలు’
‘కందనూలు’గా పిలిచే నాగర్‌కర్నూల్‌లోరాజకీయమంతా సాగునీరు, అభివృద్ధి చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ ప్రధాన పోటీ మర్రి జనార్ధన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), నాగం జనార్ధన్‌రెడ్డి (కాంగ్రెస్‌) మధ్యే ఉంది. ఇక్కడి నుంచి ఆరుసార్లు గెలిచిన నాగం, ప్రస్తుతం మర్రి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కు తానే జీవం పోశానని నాగం జనార్ధన్‌రెడ్డి చెబుతోంటే, దాని ద్వారా లక్ష ఎకరాల కు సాగునీరు, 100 చెరువులు నింపిన ఘన త తనదేనని మర్రి హోరెత్తిస్తున్నారు. ఇంకా అభివృద్ధి పనులను ప్రచారంలో ప్ర స్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన కె.దామోదర్‌రెడ్డికి 43 వేలు, టీఆర్‌ఎస్‌కు 65 వేల ఓట్లు వచ్చా యి. ప్రస్తుతం దామోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం మర్రికి కలిసొచ్చే అవకాశం. అయితే, దిలీపాచారి (బీజేపీ)..టీఆర్‌ఎస్‌ ఓట్లను కొంత చీల్చే అవకాశం ఉంది. 

షాద్‌నగర్‌: ‘కీ’లకం.. రెబల్‌
ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి తలపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ రెబల్‌గా వీర్లపల్లి శంకర్‌ (బీఎస్పీ) బరిలో నిలిచారు. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య ఉన్నా.. గెలుపోటములను మాత్రం బీఎస్పీ అభ్యర్థే నిర్ణయించనున్నారు. ఇక్కడ ఎక్కువగా ముదిరాజ్, యాదవ కులాల ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఉద్యమ ప్రభావంతో ప్రతాప్‌రెడ్డిపై అంజయ్య యాదవ్‌ 18 వేల మెజార్టీతో గెలిచారు. అయితే ఈసారి పలు విషయాల్లో ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. షాద్‌నగర్‌ పట్టణంలో వైశ్య కులాలు ప్రతాప్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్పీ అభ్యర్థి శంకర్‌ కొందుర్గు, నందిగామ, కొత్తూరు మండలాల్లో టీఆర్‌ఎస్‌ ఓట్లను చీల్చనున్నారు. శంకర్‌ కులానికి చెందిన రజక ఓటర్లు 8 వేల మంది వరకు ఉన్నారు. లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ ద్వారా సాగు, తాగునీటి వసతి కల్పిస్తామనే టీఆర్‌ఎస్‌ హామీ ఎంత వరకు పని చేస్తుందనేది గెలుపోటములను నిర్ణయిస్తుంది.

మహబూబ్‌నగర్‌: పోటీ గరం గరం
ఇక్కడ రసవత్తర పోటీ నడుస్తోంది. ప్రముఖులంతా పోటీలో నిలవడం, కులాల వారీగా ఓట్లు చీలడం వంటివి ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ (టీఆర్‌ఎస్‌) ప్రచారంలో ముందున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఉద్యోగ సంఘాల మద్దతు ఉండడం అనుకూలాంశం. టీడీపీ నుంచి ముదిరాజ్‌ వర్గానికి చెందిన ఎర్ర శేఖర్‌ పోటీలో నిలవడంతో ఆయనకే వారంతా (45 వేల మంది) అనుకూలంగా ఉన్నారు. 35 వేల వరకు ఉన్న ముస్లింలు బీఎస్పీ నుంచి పోటీలో ఉన్న ఇబ్రహీంకు మద్దతిస్తున్నారు. దీంతో ఓట్లు చీలిపోవచ్చు. టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఇంటి పార్టీ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీజేఎస్‌ నేత రాజేందర్‌రెడ్డి ఎర్ర శేఖర్‌కు మద్దతిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేకులూ శేఖర్‌ వెనుకే చేరారు. ఇది ఆయనకు కలిసి రావచ్చు. అయితే ఎన్సీపీ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ రెబల్‌ నేత ఎం.సురేందర్‌రెడ్డి.. శేఖర్‌ అవకాశాలను దెబ్బతీస్తారని అంచనా. బీజేపీ నుంచి బరిలో ఉన్న పద్మజారెడ్డి సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఏకకాలం లో నిర్వహించిన మోదీ, కేసీఆర్‌ బహిరంగసభలు రెండూ విజయవంతమయ్యాయి. ఏ పార్టీకి ఎవరు మద్దతిస్తున్నారో తెలియని పరిస్థితి. 

కొడంగల్‌: టగ్‌ ఆఫ్‌ వార్‌
రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కొండగల్‌ ఒకటి. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీఆర్‌ఎస్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఆ దిశగా రెండేళ్ల ముందు నుంచే ఇక్కడ వ్యూహ రచన మొదలుపెట్టింది. సంపన్నుడు, కొడంగల్‌ అల్లుడు అయిన మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డిని బరిలోకి దించింది. ఇక్కడ అభ్యర్థుల విజయావకాశాలు బలహీన, గిరిజన, 15 వేలకు పైగా ఉన్న మైనారిటీ ఓట్లపైనే ఆధారపడి ఉంటాయి. రెండుసార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు, మాటలతో ఆకట్టుకునే తీరు రేవంత్‌కు ప్రధాన ఆకర్షణలు. ఆయా అభివృద్ధి పనులే అస్త్రాలుగా నరేంద్‌రెడ్డి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో 80శాతానికి పైగా ప్రజా ప్రతినిధులను టీఆర్‌ఎస్‌ తన వైపు లాక్కుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల ఓటర్లు ఉండటం, గ్రామీణ కుటుంబాల్లో కచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ పథకం నుంచి లబ్ధి పొందిన వారుండటంతో వారందరినీ ఓట్లుగా మలుచుకునే యత్నాల్లో టీఆర్‌ఎస్‌ తలమునకలైంది. ఇక, రేవంత్‌రెడ్డి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా, ఆయన తరపున సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్‌రెడ్డి తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో గెలిచిన రేవంత్‌.. ఈసారి బీజేపీ సైతం పోటీలో ఉండటంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బీజేపీ అభ్యర్థి నాగురావ్‌ నామాజీ కనీసం 10 వేల ఓట్లను పొందవచ్చని అంచనా. అదే జరిగితే రేవంత్‌కు వచ్చే ఓట్లలో చీలిక ఏర్పడే అవకాశం ఉంది. 

మక్తల్‌లో కొత్త మలుపు
వెనుకబడిన ప్రాంతమైనా.. రాజకీయ చైతన్యం ఎక్కువుండే మక్తల్‌లో త్రిముఖ పోటీ నడుస్తోంది. 2014లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అదే పార్టీ నుంచి బరిలో ఉండగా, ‘కూటమి’ తరఫున మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు కలిపి నిలబెట్టిన జలంధర్‌రెడ్డి ఈ ఇద్దరికీ తీవ్ర పోటీనిస్తుండటం మక్తల్‌ రాజకీయాల్లో కొత్త మలుపు. చిట్టెంకు ఇక్కడ అసమ్మతి ఎక్కువగా ఉంది. టీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నేతలంతా జలంధర్‌ పక్కన చేరారు. ఇక దయాకర్‌రెడ్డికి కాంగ్రెస్‌ వర్గం పనిచేయట్లేదు. వారు సైతం జలంధర్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు లోపాయికారిగా జలంధర్‌నే బలపరుస్తున్నారు. దీంతో పోటీ ప్రస్తుతం చిట్టెం వర్సెస్‌ జలంధర్‌గా మారింది. నర్వ, ఆత్మకూర్‌లో చిట్టెం వర్గాన్ని జలంధర్‌ అనుకూలంగా మలుచుకున్నారు. దీనికి తోడు కారు గుర్తుకు దగ్గరి పోలికగా ఉండే ట్రాక్టర్‌ గుర్తు జలంధర్‌కు దక్కడం వల్ల కొన్ని ఓట్లు తనకు లాభిస్తాయని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ క్రమంలో చిట్టెం గెలుపు బాధ్యతను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. ఇక్కడి అసమ్మతిని చల్లార్చే యత్నం చేశారు. 

అలంపూర్‌ (ఎస్సీ): ‘నడిగడ్డ’.. ఎవరికి అడ్డా?
కృష్ణా, తుంగభద్ర నడిగడ్డ అలంపూర్‌లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌.. టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే అబ్రహాం బరిలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువున్న ఈ నియోజకవర్గంలో వారి ఆశీస్సులు ఎవరికుంటే వారే విజేత. అలంపూర్, ఉండవల్లి, మానోపాడ్‌ మండలాల్లో కాంగ్రెస్‌ బలంగా ఉండగా, ఇటిక్యాల, రాజోలి, అయిజ మండలాల్లో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. 7 వేల మంది సెటిలర్‌ ఓటర్లున్న వడ్డేపల్లి మండలం ఎటు మొగ్గితే అటే విజయం ఖాయం కానుంది. ఇక్కడ కీలక నేతగా ఉన్న చల్లా వెంకట్రాంరెడ్డి సంపత్‌కు మద్దతునిస్తుండగా, డీకే భరతసింహారెడ్డి వర్గం తటస్థంగా ఉంది. అబ్రహాం తన హయాంలో అలంపూర్‌ ఎత్తిపోతల చేపట్టడం, గ్రామాలకు రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, అలంపూర్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేసిన పేరుంది. సంపత్‌ హయాంలో బస్‌డిపో, ఫైర్‌ స్టేషన్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కనీసం స్థలాల సేకరణ సైతం చేయలేదన్న అసంతృప్తి ఉంది. ఇటీవలే తుమ్మిళ్ల ఎత్తిపోతల ట్రయల్‌రన్‌ సక్సెస్‌ కావడం, 15 వేల ఎకరాలకు నీరందించేలా కాల్వలు పారించడం టీఆర్‌ఎస్‌కు అనుకూలించే అవకాశం ఉంది. 

వనపర్తి: అంతటా ఆసక్తి
వనపర్తిలో పాతకాపుల మధ్యే మళ్లీ పోటీ. తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.చిన్నారెడ్డి – రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) మధ్య పోటాపోటీ నడుస్తోంది. ఈసారి టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి కూటమిగా పోటీ చేస్తుండటం, రెండు పార్టీల ఓట్లు కలిస్తే గెలుపు నల్లేరుపై నడకేనని కాంగ్రెస్‌ అంటోంది. చిన్నారెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి రావుల హాజరు కాగా, తర్వాత పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన వర్గం మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది. చివరి ఆరు రోజులు రావుల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక, నిరంజన్‌రెడ్డి కుల సంఘాలను ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుస్తూ ముందుకు సాగుతున్నారు. వనపర్తిలో సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద సభ నిర్వహించడం తెరాస వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. కేఎల్‌ఐ ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడం, ఇతర అభివృద్ధి పనులు సానుకూలాంశాలు. నిరంజన్‌రెడ్డి పెద్దమందడి, ఘణపూర్, గోపాల్‌పేటలో పట్టు సాధించారు. పెబ్బేరులో డిగ్రీ, మోడల్, పాలిటెక్నిక్‌ విద్యాసంస్థల ఏర్పాటుతో ఈ మండలంలో చిన్నారెడ్డి ముందున్నారు. వనపర్తి పట్టణంలో టీడీపీ వర్గం కాంగ్రెస్‌కు పనిచేస్తోంది. హోరాహోరీ పోటీలో ఎవరు గట్టెక్కినా 5వేలలోపు మెజార్టీయే ఉండనుంది.

కొల్లా‘పోరు’లో గెలిచేదెవరు?
మంత్రి జూపల్లి కృష్ణారావు ‘డబుల్‌ హ్యా ట్రిక్‌’కు యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌.. బీరం హర్షవర్దన రెడ్డిని బరిలో నిలిపింది. ఆయన శ్రీశైలం ముంపు నిర్వాసితులు ఎక్కువున్న వీపనగండ్ల, చిన్నంబావిలో ముందంజలో ఉన్నారు. వారికి న్యాయం చేస్తామని చెబుతూనే, సోమశిల బ్రిడ్జి చేపడతామని కొల్లాపూర్, కోడేరు మండల ప్రజలను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ టిక్కె ట్‌ ఆశించి భంగపడ్డ నేతలు సైతం సహకరిస్తుండటం కలిసొస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్‌ కొల్లాపూర్‌ రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు ఓకే చెప్పా రు.  పోల్‌ మేనేజ్‌మెంట్‌లో సిద్ధహస్తుడైన జూపల్లి..చివర్లో ఏం చేస్తారనేదే కీలకం.

కల్వకుర్తి: ముగ్గురి కుస్తీ
కల్వకుర్తిలో ముక్కోణ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ తలపడుతున్నా యి. 2014లో ఈ స్థానం ఫలితాలు ఉత్కంఠ రేపా యి. జూపల్లి పోలింగ్‌బూత్‌లో సాంకేతిక కారణాల వల్ల అక్కడ రీపోలింగ్‌ జరిపారు. నాడు.. తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తన ప్రత్యర్థి ఆచారిపై 78 ఓట్ల తేడాతో  గెలుపొందారు. తాజా పోరులో వీరిద్దరికీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌ యాదవ్‌ గట్టి పోటీనిస్తుండటంతో కల్వకుర్తి రాజకీయం రసకందాయంలో పడింది. తాజా మాజీ ఎమ్మెల్యే కావడం, అధికార పార్టీపై వ్యతిరేకత, జైపాల్‌రెడ్డి వర్గం మద్దతు వంశీకి కలిసొచ్చే అంశాలు. కేవలం 78 ఓట్లతో గెలిచాడన్న ప్రచారం, ప్రధాన కేడర్‌ దూరం కావడం, బీఎస్పీ పోటీలో ఉండటంతో ఓట్లు చీలనుండటం ప్రతికూలం. జైపాల్‌యాదవ్‌కు స్థానికత, బీసీ, సంక్షేమ పథకాలు, బలమైన కేడర్, రెండు సార్లు ఎమ్మెల్యేగా చేయడం బలాలు కాగా, కేడర్‌లో గ్రూపులు మైనస్‌ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ఆచారికి 78 ఓట్లతో ఓడిపోయిన సానుభూతి కలిసొస్తోంది.

దేవరకద్ర: గెలుపు.. అబ్రకదబ్ర
తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), పవన్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌) మధ్య పోటీ ఉంది. మరోసారి సత్తా చాటుకునేందుకు సిద్ధమైన ‘ఆల’.. ముదిరాజ్, యాదవ, వాల్మీకి వర్గ నేతలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా సాగునీటిని అందించేందుకు చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఆరోపణలే అస్త్రాలుగా కాంగ్రెస్‌ అభ్యర్థి పవన్‌ ప్రజల్లోకి వెళుతున్నారు. భూత్పూర్, కొత్తకోట మండలాల్లో కాంగ్రెస్‌..సీసీకుంట, అడ్డాకుల, దేవరకద్ర మండలాల్లో టీఆర్‌ఎస్‌ ముందున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి సైతం పవన్‌ గెలుపునకు ప్రచారం చేస్తున్నారు.

అచ్చంపేట: రెండు పార్టీల ‘సై’ఆట
అచ్చంపేట బరిలో టీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌ తలపడుతున్నాయి. బీసీ ఓటుబ్యాంకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. బలమైన కేడర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ ఆశ పెట్టుకున్నారు. 30వేలకు పైగా మాదిగలు ఉండటం, అచ్చంపేట మునిసిపల్‌ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వ పథకాలు, పార్టీ పెద్దల అండ బాలరాజుకు కలిసొచ్చే అంశం. స్థానికుడు కాకపోవడం, కీలక వ్యక్తులు పార్టీ విడిచిపోవడం కొంత ఇబ్బందే.. వంశీకృష్ణకు 1999, 2009, 20014లో ఓడిపోయిన సానుభూతి అనుకూలించే అవకాశం. సొంత సా మాజికవర్గం మాల ఓట్లు 30 వేలకుపైగానే ఉండటం, కూట మి పక్ష నేతలను ఒక్కటి చేయడం కూడా అనుకూలాంశం.

రంగంలోకి ట్రబుల్‌ షూటర్‌
గద్వాల, కొడంగల్, మక్తల్, అలంపూర్‌ స్థానాల్లోని కాంగ్రెస్‌ నేతలకు ముకుతాడు వేసేందుకు టీఆర్‌ఎస్‌.. ఆ పార్టీ ట్రబుల్‌ షూటర్, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపింది. ఏదైనా నియోజకవర్గం బాధ్యతలను అప్పగిస్తే వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు అక్కడి అభ్యర్థులను గెలిపిస్తారనే పేరున్న హరీశ్‌ అప్పుడే తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా గద్వాలలో ప్రచారం చేసిన హరీశ్, అక్కడ అసంతృప్త నేతలను మచ్చిక చేసుకున్నారు. వారందరినీ పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డికి సహకరించేలా చూశారు. తుమ్మిళ్ల, నెట్టెంపాడు పనులు, గట్టు ఎత్తిపోతల పథకాలపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు నూరిపోశారు. కొడంగల్‌ నియోజకవర్గ రాజకీయాలనూ ఆయన ప్రభావితం చేస్తున్నారు. అలంపూర్‌లో అబ్రహాం గెలుపునకు అవలంబించే వ్యూహంపై ఆయన శ్రేణలుకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్నారు. ఈ స్థానాన్ని తెరాస తన ఖాతాలోకి వేసుకోవాలని భావిస్తోంది. మక్తల్‌లోనూ అసంతృప్తులను దారిలోకి తెచ్చారు. ఇక కాంగ్రెస్‌లోని ఓ వర్గంతోనూ ఆయన టచ్‌లో ఉన్నారు. 

ప్రభావితం చేసే అంశాలు ఇవే.. 
- పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సత్వర పూర్తి  
- కొడంగల్‌–నారాయణపేట ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయాలు చూపడం 
- శ్రీశైలం ప్రాజెక్టు కింది ముంపునకు గురైన నిర్వాసితులకు 
- జీవో 98 అమలు చేయడంలో శ్రద్ధ 
- కౌలు రైతులకు రైతుబంధు అమలు.. 
- సాగునీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి వలసల నివారణ  
- ఏపీకి సరిహద్దుగా ఉన్న అలంపూర్‌లో లోకల్, నాన్‌ లోకల్‌ సమస్య ఉంది. వైద్యం, విద్య అవకాశాల్లో స్థానికత సమస్య 
- ఆర్డీఎస్‌ కాల్వల ఆధునికీకరణ సత్వర పూర్తి 
- గద్వాల చేనేత  కార్మికుల రక్షణకు వీలుగా హ్యాండ్లూమ్‌ పార్క్‌ నిర్మాణం వేగం చేయడం 
- నారాయణపేట, మక్తల్, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో రోడ్లు అభివృద్ధి
- 32వ జిల్లాగా నారాయణపేట, కొత్త రెవెన్యూ డివిజన్‌గా కొల్లాపూర్‌ హామీలు 
గ్రౌండ్‌ రిపోర్ట్‌
సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement