కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వారసుల జోరు కనిపిస్తోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు ఈ సారి తమ వారసుల్ని రంగంలోకి దించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లకు ఈ నెల 24 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్)లు టిక్కెట్ల పంపిణీపై భారీగా కసరత్తు చేస్తున్నాయి. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌కు బాటలు వెయ్యడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కుమారుల మధ్య పోటీకి సై ?
ఎంతోమంది వారసులు ఈ సారి బెర్త్‌లు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ అందరి దృష్టి ఇప్పుడు మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గంపైనే పడింది. ఈ నియోజకవర్గంలో అమీతుమీ తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం నుంచే కుమారుడ్ని రంగంలోకి దించడానికి సిద్దరామయ్య సర్వం సిద్ధం చేశారు. తన కుమారుడు పోటీ చేయడానికి వీలుగానే సిద్దరామయ్య ఈ సారి వరుణకు బదులుగా దాని పక్కనే ఉన్న చాముండేశ్వరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ కూడా వరుణ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పోటీకి దింపాలని భావిస్తోంది. విజయేంద్ర అయితేనే యతీంద్రకు గట్టి పోటీ ఇవ్వగలడని అంచనాకి వచ్చింది. అంతే కాక వరుణ నియోజకవర్గంలో లింగాయత్‌ల జనాభా ఎక్కువ. విజయేంద్ర కూడా లింగాయత్ వర్గానికి చెందిన వాడు కావడంతో అతనిని బరిలోకి దింపితేనే పోటీ రసవత్తరంగా ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే విజయేంద్ర వరుణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వంశం పేరు చెప్పుకొని బీజేపీ నుంచి ఎవరూ టిక్కెట్ ఆశించలేరంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు పార్టీ కేడర్ ఆహ్వానం మేరకే తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజాసమస్యల్ని తెలుసుకుంటున్నానని విజేయంద్ర అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వ్యూహాలను కూడా రూపొందిస్తున్నట్టు చెప్పారు . మొత్తానికి వరుణ నియోజకవర్గంలో కుమారుల మధ్య పోటీ ఉంటుందా లేదా అన్న సస్సెన్స్‌కు మరి కొద్ది రోజుల్లోనే తెరపడనుంది.
టిక్కెట్ రేసులో మరికొందరు వారసులు
పార్టీలకతీతంగా చాలా మంది నాయకులు తమ వారసుల్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో తమ పిల్లలకు టిక్కెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. కర్ణాటక హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం బెంగుళూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న సౌమ్య టిక్కెట్ కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. న్యాయశాఖమంత్రి టీబీ జయచంద్ర కుమారుడు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఎన్ రాజన్న కుమారుడు రాజేంద్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ ఆల్వాలు టిక్కెట్ల రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత పోటీ లేకపోయినా బీజేపీ నేతలు కూడా వారసుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.బీజేపీ నేతపరిమళ నాగప్ప తన కుమారుడు ప్రీతమ్‌కు హనూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల బరిలో కుటుంబానికి కుటుంబం
మరోవైపు జేడీ (ఎస్)లో వారసులకు కొదవే లేదు. జేడీ (ఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవలు కూడా ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి ఆయన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణలు మాత్రమే కాదు వారి భార్యలు అనిత కుమారస్వామి, భవానీ రేవణ్ణలు కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. రేవణ్ణ తన కుమారుడు ప్రజ్వల్‌ను కూడా ఈ సారి ఎన్నికల బరిలో దించుతూ ఉండడంతో, కుమారస్వామి కూడా తన కుమారుడు, నటుడైన నిఖిల్‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి నిఖిల్‌కు రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేకపోయినా బలవంతంగా ఒప్పించి తీసుకువస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి మంచి పట్టు ఉన్న పాత మైసూరు నుంచే నిఖిల్‌ను ఎన్నికల బరిలోకి దించాలని కుమారస్వామి యోచిస్తున్నారు..మొత్తంగా చూస్తే ఈ సారి ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఎక్కడ చూసినా వారసుల సందడే కనిపిస్తోంది.
-- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment