
ప్రజా గాయకుడు గద్దర్
అప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టాలని కోరానని, ఇప్పుడు..
కామారెడ్డి: ప్రతిపక్షాల ఓట్లు చీలేవిధంగా ఉంటే తాను పోటీ చేయనని, అన్ని పార్టీలు కలిసి తనను పోటీ చేయాలని కోరితే అప్పుడు ఆలోచిస్తానని ప్రజా గాయకుడు గద్దర్ చెప్పారు. బుధవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20న జరిగే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు కచ్చితంగా వచ్చేది ఓట్ల విప్లవమేనన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసే అవకాశం వచ్చింది కానీ లోకల్ పార్టీ టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం రాలేదని పరోక్షంగా విమర్శించారు.
30 నిమిషాల పాటు రాహుల్‌కు పాటలు పాడి వినిపించినట్లు తెలిపారు. అప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టాలని కోరానని, ఇప్పుడు ఓట్ల విప్లవానికి శ్రీకారం చుడుతున్నానని వ్యాఖ్యానించారు. నేను ఏ పార్టీ సభ్యుడిని కాదని, పల్లె పల్లెకు మీ పాటనై వస్తున్నానని అన్నారు. తాను పుట్టింది గజ్వేల్‌లోనే..అందుకే మీడియా మిత్రులు అడిగిన సందర్భంలో ఇక్కడే పోటీ చేస్తానని చెప్పానని తెలిపారు.