
విజయవాడ: తాను ఎలాంటి తప్పు చేయలేదని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. ఏసీబీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నందుకే తనపై కక్ష గట్టి ఏసీబీ కేసులంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు ఇప్పించినందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.
కేవలం తాను సాక్షిగా మాత్రమే విచారణకు హాజరయ్యాను అని తెలిపారు. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నుంచి తాను భూములు కొన్నది వాస్తవమేనని తెలిపారు. తాను చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశానని తెలియజేశారు. చంద్రబాబు అవినీతి బట్టబయలు చేస్తున్నందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక కాపు సోదరుడు, డీఎస్పీ దుర్గా ప్రసాద్ దగ్గర భూములు సక్రమంగా కొనుగోలు చేయడం తప్పేమైనా అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు. సంవత్సరన్నర నుంచి నడుస్తున్న ఈ కేసులో తాను అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. కేవలం సాక్ష్యం కోసం మాత్రమే ఈ కేసులో హాజరయ్యానని చెప్పారు. ఆర్కే దగ్గర కీలక సమాచారం రాబట్టారని టీడీపీ వారు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయడం మొదలు పెట్టారని, అందులో వాస్తవం లేదని అన్నారు. కేవలం ఏసీబీ అధికారులు, దుర్గా ప్రసాద్ ఎవరో తెలుసా, ఆయన దగ్గర ఎప్పుడు ఆస్తులు కొనుగోలు చేశారు అనే చిన్న ప్రశ్నలు మాత్రమే అడిగి వదిలేశారని, అందులో దాచిపెట్టవలసినంత పెద్ద విషయాలేమీ లేవని, ఇవి అందరికీ తెలిసిన విషయాలేనని చెప్పారు.
రైతుల పొట్టకొట్టి రాజధానిలో వేలాది ఎకరాలు చంద్రబాబు దోచుకున్నాడని, తమిళనాడులో ఉన్న మన రాష్ట్రానికి చెందిన సదావర్తి భూములు కూడా కొట్టేసేందుకు తండ్రీకొడుకులు కుట్ర పన్నారని, ఇలా చంద్రబాబు నాయుడు దోచుకుంటున్న వాటికి ఆధారాలు సేకరించి తాను న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో తనపై కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కూడా మేనేజ్ చేయగల సమర్దుడు చంద్రబాబు అని ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు.
గత డిసెంబర్‌లో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎర్లీ హియరింగ్ పిటిషన్ కూడా వేశానని తెలిపారు. సుప్రీం కోర్టు కూడా దీన్ని స్వీకరించిందని తెలిపారు. ఒత్తిళ్లకు లొగి తెలంగాణ ఏసీబీ ఓటుకు నోటు కేసును సరిగా దర్యాప్తు చేయడంలేదని, సీబీఐ దర్యాప్తు చేస్తేనే అసలు నిజం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి 2017 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 5 సార్లు సుప్రీం కోర్టును ఆశ్రయించానని..అందుకే తనపై కక్ష కట్టాడని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment