బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టవద్దంటూ తనకు ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయని కర్ణాటక బీజేపీ కీలక నేత బీఎస్ యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఎలాంటి ప్రయత్నాల్లో భాగం కావొద్దని బీజేపీ అధిష్టాన పెద్దలు తనకు సూచించారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘ఢిల్లీ నుంచి తిరిగొచ్చాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని మా నేతలు నాకు సూచించారు’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరికొంతకాలం వేచిచూస్తామని, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ఏదైనా జరగవచ్చునని, ఏదిఏమైనా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే, పడగొట్టే చర్యలకు పాల్పడవద్దని మాకు స్పష్టంగా సూచనలు అందాయని తెలిపారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ దిగ్గజాలు ఓటమిపాలవుతారని, దీంతో ఆ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందని, ఆ రెండు పార్టీల అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకుంటాయని బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఆయన పేర్కొన్నట్టుగానే జేడీఎస్ సుప్రీం దేవెగౌడ, ఆయన మనవడు నిఖిల్ గౌడ సహా పలువురు సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. పొలిటికల్ మైలేజ్ కోసం సిద్దరామయ్యనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ వద్దకు పంపిస్తున్నారని యడ్యూరప్ప విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment