ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, మా ఎమ్మెల్యేలంతా వజ్రాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కితాబిచ్చారు. బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌లో ఉన్న వారందరూ తెలంగాణ బిడ్డలేనని వ్యాఖ్యానించారు. కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్, బీజేపీలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. కేసీఆర్ ఇప్పటికే దీనిపై పథకం రూపొందించామన్నారు.
ఈ 29న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఈ దేశం మరికొన్ని నెలల్లో సరికొత్త పాలనను చూడబోతుందన్నారు. కర్ణాటకలో ఎన్నికలు రాగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావేరీ జలాల విషయమై కొత్త నాటకాలకు తెర తీశారంటూ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం చేతగానితనంలోనే నీటి సమస్యలు కొనసాగుతున్నాయని.. 'ప్రతి రైతుకు నీళ్లు.. ప్రతి ఎకరాకు నీళ్లు' అనేది ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు.
'తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. దేశంలో రోజు మొత్తం కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. విద్యుత్ సరఫరాపై కొందరు కావాలనే విమర్శిస్తున్నారు. 2 వేల కోట్ల రూపాయలతో తాగునీటి సమస్యను పరిష్కరించాం. హైదరాబాద్‌లో ఇప్పుడు తాగునీటి సమస్య లేదు. భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తి చేశాం. త్వరలో పాస్‌బుక్‌లు రైతులకు అందజేస్తాం. రిజిస్ట్రేషన్ల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. త్వరలో ధరణి పేరుతో కొత్త విధానం తీసుకొస్తాం. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు లేకుండా చేశాం. తెలంగాణ వ్యాప్తంగా సారాను నిర్మూలించాం. గొర్రెల పథకం విజయవంతం అయింది. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అభివృద్ధి నిధులు అందజేశామని' సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment