సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 17 వసంతాలు పూర్తి చేసుకుని 18వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లోని కొంపెల్లి జీబీఆర్ గార్డెన్‌లో నిర్వహించనున్న ప్లీనరీకి ఉమ్మడి జిల్లా పరిధి నుంచి నేతలను తరలించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ప్లీనరీకి పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నా.. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందికి మించకుండా ప్రతినిధులను మాత్రమే తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి 1300 మందికి మాత్రమే ప్రతినిధులుగా ప్లీనరీలో పాల్గొనే అవకాశం లభించనుంది. ఆయా నియోజకవర్గాలకు చెందినప్రజాప్రతినిధులు, ముఖ్యులు 100 మందికి మా త్రమే అనుమతి ఉండడంతో మిగతావారు సహకరించాలని పార్టీ పెద్దలు ఇప్పటికే కేడర్‌కు సూచించా రు. గతంలో జరిగిన ప్లీనరీల కన్నా భిన్నంగా ఈ దఫా జరిగే ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతోపాటు జాతీయ అంశాలపై చర్చించి దేశానికే దిక్సూచీలా తీర్మానాలు ఉండేలా కసరత్తు జరుగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తెరపైకి వచ్చిన నేపథ్యంతోపాటు మరో యేడాదిలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులకు ప్లీనరీ వేదికగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు క్యాడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వేదికగా ఉపయోగించుకోనున్నారు.
సక్సెస్ కోసం ప్రజాప్రతినిధుల కసరత్తు
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్లీనరీని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయమై ఇప్పటికే ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తున్నారు. మంగళవారం టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి జనరల్ సెక్రెటరీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల ఇన్‌చార్జిలు గూడూరి ప్రవీణ్, కర్ర శ్రీహరి, వై.సునీల్‌రావు తదితర నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్లీనరీకి డెలిగేట్స్ తరలింపు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్వేత ఇంటర్నేషనల్ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నియోజకవర్గానికి 100మంది చొప్పున 1300 మంది ప్లీనరీకి హాజరయ్యేలా చూస్తామన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో..
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో ప్లీనరీ నిర్వహణపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలను కూడగట్టి మద్దతు పొందిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పేందుకు ప్లీనరీని వేదికగా ఉపయోగించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై రాష్ట్రానికి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు వస్తున్న సందర్భంగా ఇక్కడి అభివృద్ధిని కీర్తిస్తూ ప్రశంసలు కురిపిస్తుండడాన్ని అవకాశంగా తీసుకుని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లేలా ప్రతినిధులకు దిశానిర్దేశనం చేయనున్నారు.
ప్లీనరీ సమావేశాలకు ప్రత్యేకత
ఈనెల 27న హైదరాబాద్‌లో నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మాజీమంత్రి, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి జనరల్ సెక్రెటరీ బస్వరాజు సారయ్య అన్నారు. ఈసారి నిర్వహించే 15వ పార్టీ ప్లీనరీకి ప్రత్యేకత ఉందని, దేశానికి దిశానిర్ధేశనం చేసేలా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని శ్వేత ఇంటర్నేషనల్ హోటల్‌లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అలుపెరుగని నేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర నిర్వహించనున్నారన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన మరింత కీలకపాత్ర వహించనున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ శ్రీకారం చుట్టిన తరుణంలో నిర్వహించే ప్లీనరీపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతుందని బస్వారాజు సారయ్య పేర్కొన్నారు. ఈ ప్లీనరీకి ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మంది ప్రతినిధులకు ఆహ్వానం ఉంటుందని, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఈ సారి కేవలం ప్రతినిధుల సభను మాత్రమే నిర్వహిస్తున్నందున తక్కువ మందికే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment