సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ కోరినన్ని సీట్లు ఇవ్వటానికి మహాకూటమి ఒప్పుకోకుంటే ప్లాన్-బీని అమలు చేస్తామని సీపీఐ సహ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 5సీట్ల కంటే తక్కువ కేటాయిస్తే తీసుకోకూడదని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్లాన్-బీ అమలు చేయాల్సి వస్తే! 24 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. కూటమిలోని మిత్ర పక్షాలకు సీట్లు ఖరారు చేయకుండా కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించటానికి సిద్ధమైందన్నారు. సీపీఐకి రెండు మూడు సీట్లంటూ కాంగ్రెస్ ఇస్తోన్న లీకులు బాధాకరమని వ్యాఖ్యానించారు.
కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తమ ప్రాతినిథ్యం ఉండాలని కుండబద్దలు కొట్టారు. నల్గొండ జిల్లాలో కనీసం ఒక్క సీటైనా ఇస్తేనే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరిస్తామని చెప్పారు. ఏ స్థానాల్లో పోటీ చేయాలో తామే నిర్ణయించుకుని కూటమిలో పార్టీలకు తెలుపుతామన్నారు. కూటమి ముందుకు వెళ్తోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చర్చలకు ముందుకు రావటం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment