
సాక్షి, హైదరాబాద్: మొదటి నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమైందనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ పుట్టి మునగకుండా కాపాడుకోవడం కోసమే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం అంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ధర్మాన మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార టీడీపీ దారుణంగా విఫలమైందన్నారు. చంద్రబాబు సాగిస్తున్న అఖిలపక్ష చర్చల డ్రామాలతో సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని, మళ్లీ ప్రజా తీర్పు కోరుతామని స్పష్టం చేశారు.
సీఎంకు హోదా ఇప్పుడే గుర్తొచ్చిందా?
‘‘రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీని అంగీకరించిన రోజే చంద్రబాబు ప్రజల పక్షాన నాయకత్వం వహించే అర్హత కోల్పోయారు. ఇంతకాలం ప్యాకేజీ అద్భుతమంటూ పాట పాడిన చంద్రబాబుకు ఇప్పుడే హోదా గుర్తొచ్చిందా? లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు వచ్చే సమయంలో చంద్రబాబు ఇక్కడ అఖిలపక్షం అంటున్నారు. రాజధాని విషయంలో ఒక్కరోజైనా ప్రతిపక్షాన్ని సంప్రదించారా? ప్రజాసంఘాలతో చర్చించారా? రాజధానిని చంద్రబాబు తన కుటుంబ వ్యవహారంగానే చూశారు. పోలవరం విషయంలో ఏనాడైనా అఖిలపక్షాన్ని సంప్రదించారా?’’ అని ధర్మాన నిలదీశారు.
రాష్ట్రం చెడిపోవడానికి బాబే కారణం
‘‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. సింగపూర్ తరహాలో ప్రతిపక్షం ఉండకూడదన్నదనే తన ఆకాంక్ష అని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పాలకుల తప్పులను, అవినీతిని బహిర్గతం చేస్తున్న ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బు, పదవులు ఎరవేసి కొనుగోలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకుని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజాగ్రహానికి తట్టుకోలేకే టీడీపీ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో పాలక పక్షం విఫలం కావడం వల్లే ఆ బాధ్యతను ప్రతిపక్ష వెఎస్సార్‌సీపీ భుజానకెత్తుకుంది. ఇప్పుడు కావాల్సింది అఖిలపక్షం భేటీ కాదు, టీడీపీ ఎంపీల రాజీనామా. రాష్ట్రం చెడిపోవడానికి, అవినీతి పెరగడానికి చంద్రబాబే కారణం. ఇలాంటి వ్యక్తితో కలిసి చర్చించడంలో అర్థం ఉందా?’’ అని ధర్మాన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment