సాక్షి, హైదరాబాద్: తెలుగుతల్లి ఎవరు, ఎవరికి పుట్టిన తెలుగుతల్లి అని ఉద్యమకాలంలో ప్రశ్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పుడా తెలుగుతల్లి ఎవరికి పుట్టిందో తెలిసిందా అని బీజేపీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుతల్లి అనేది ఆధిపత్యం కోసం కొందరు పుట్టించిన భావన అని, దీనిపై అవమానించే విధంగా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిని ప్రవేశపెట్టాలనే యోచన వెనుక టీఆర్‌ఎస్ రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. నిధుల్లేక నీరసపడిపోయిన స్థానిక సంస్థలను మరింత నిర్వీర్యం చేసేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారన్నారు. అన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్న కేసీఆర్ దురాలోచన నుంచే సర్పంచును పరోక్షంగా ఎన్నుకోవాలనే చట్టం తెచ్చారని ఆరోపించారు.
కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటూ ఎన్నికలప్పుడు చెప్పారని, ఇప్పుడేమో ప్రైవేట్ కాలేజీల ద్వారా భారీగా ఫీజులను వసూలు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లను కూడా యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయని, దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. విద్యార్థుల నుంచి ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజుల్లో కేసీఆర్‌కు కూడా వాటా వెళుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment