
సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను దివాళా తీయించిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుదేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాలో నేడు చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విద్యార్థులకు మెస్ చార్జీలు కూడా చెల్లించలేని దుస్థితిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందన్నారు.
ఫీజు రీయంబర్స్‌మెంట్, షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, రైతుబంధు పథకాల అమలుకు కూడా డబ్బుల్లేవన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చిన చెక్కులు సైతం బౌన్స్ అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ప్రజల సొమ్మును దుబారా చేస్తూ కాలం వెళ్లదీసిన కేసీఆరే ఇందుకు బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కబంధహస్తాల్లో చిక్కుకుందని, మహాకూటమిని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో ‘మార్పుకోసం బీజేపీ’అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. సమావేశంలో బీజేపీ నేతలు కృష్ణసాగర్‌రావు, బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment