రాజకీయాల్లో రాటుదేలిన చిన్నమ్మ.. చెల్లని నోట్లు, నల్లధనమార్పిడిలోనూ సిద్ధహస్తురాలని ఐటీశాఖ తేల్చింది. చెల్లని నోట్లను రుణంగా ఇచ్చి వడ్డీ పొందిన వైనాన్ని బయటపెట్టింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టుకు నివేదించింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు పెట్టిన కేసుపై సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేలా అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో శశికళ పిటిషన్ వేసి ఉన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి అనితా సుమంత్ సమక్షంలో గతంలో విచారణకు వచ్చింది. దీనిపై ఐటీశాఖ తరఫున పిటిషన్ దాఖలైంది. పెద్దనోట్ల రద్దు సమయంలో శశికళ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించిచెల్లని నోట్లను అందజేసి రూ.1,674 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారని ఆ పిటిషన్‌లో ఐటీశాఖ పేర్కొంది. ఐటీ దాఖలు చేసిన పిటిషన్‌లో మరిన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. నమదు ఎంజీఆర్ దినపత్రిక కార్యాలయంలో 2017 నవంబర్ 9వ తేదీన జరిపిన ఐటీ దాడులు సమయంలో ఒక నోటుపుస్తకంలో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. ఈ నోటు పుస్తకం, డాక్యుమెంట్లలోని వివరాలపై ఐటీ ఆరాతీయగా శశికళ బంధువైన శివకుమార్‌కు చెన్నై టీ నగర్‌లోని టీఎన్ హరిచందన ఎస్టేట్ కంపెనీతో సంబంధాలున్నట్లు కంపెనీ మేనేజర్ బాలాజీ తెలిపాడు.
ఐటీ అధికారులు శివకుమార్‌ను విచారించగా అపోలో ఆసుపత్రికి వచ్చి తనను కలవాలని 2016 నవంబర్ 16వ తేదీన శశికళ నుంచి పిలుపువచ్చిందని, తాను వెళ్లి కలవగా తిరుచెంగోట్టిలో ఉన్న క్రిస్టీ ప్రైడ్‌గ్రామ్ పరిశ్రమ అధినేత కుమారస్వామితో మాట్లాడి రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మార్చాల్సిందిగా ఆమె చెప్పారని తెలిపాడు. కేంద్ర ప్రభుత్వ ఆహార పథకానికి ఫలసరుకులు, రాష్ట్రంలో పౌష్టికాహార సరఫరా చేసే ప్రభుత్వ కాంట్రాక్టరు కుమారస్వామి అప్పట్లో వ్యవహరించేవారని శివకుమార్ చెప్పాడు. శశికళ ఆదేశాల ప్రకారం కుమారస్వామిని తాను కలిసి.. తమ వ్యాపారాభివృద్ధి కోసం రుణంగా కొన్ని కోట్ల రూపాయల చెల్లని నోట్లను ఇస్తాం, ఇందుకు బదులుగా ఒక ఏడాది తరువాత 6 శాతం వడ్డీతో సహా రూ.2000తో కూడిన కొత్త నోట్లను చెల్లించాలని డీల్ కుదుర్చుకున్నానన్నారు. పాత నోట్లను మార్చుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముందు రోజన లావాదేవీలను పూర్తిచేసుకున్నామన్నారు.
చెన్నై టీనగర్ వన్నియర్ వీధిలోని కాటేజ్ బ్లేడు రిసార్ట్ సంస్థ కార్యాలయం నుంచి తొలి విడతగా డిసెంబర్ 29వ తేదీన రూ.101 కోటి, రెండో విడతగా అదే నెల 30వ తేదీన రూ.136 కోట్లు లెక్కన రూ.237 కోట్లను చెల్లించామని ఐటీ అధికారులకు శివకుమార్ వాంగ్మూలం ఇచ్చాడు. దీని ఆధారంగా గత ఏడాది జూలై 5వ తేదీన తిరుచెంగోడులోని కుమారస్వామికి చెందిన కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. శశికళ ద్వారా నగదు తీసుకున్నట్లు కుమారస్వామి, ఆయన కుమారుడు తిరుపతి అధికారుల వద్ద అంగీకరించారు. ఇదికాకుండా రూ.1911.50 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి శశికళ గోప్యంగా ఉంచి పన్ను కట్టలేదు. ఎంజీఆర్, జయలలిత జన్మదినాల్లో నమదు ఎంజీఆర్ దినపత్రికలో పార్టీ నేతల పేర్లతో భారీ ప్రకటనలు వచ్చాయి. అయితే వారెవరూ తాము ప్రకటనలు ఇవ్వలేదని ఐటీ అధికారులకు తెలిపారు. శశికళనే ఆ ప్రకటనలు ఇచ్చి నల్లధనాన్ని మార్చినట్లు తేలిందని ఐటీశాఖ కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment